దత్త దర్శనం

దత్త దర్శనం 


అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగు వైపు పయనింపజేసే త్రిమూర్తి స్వరూపుడు- గురువు! శిష్యుల హృదయాల్ని వెలిగించి, వారికి మార్గదర్శనం చేయడంలో గురు పాత్ర ముఖ్యమైనది. ఆ పరంపరకు ఆద్యుడిగా, మహా అవధూతగా, జ్ఞాన ప్రదాతగా దత్తాత్రేయస్వామిని సంభావిస్తారు. భక్తరక్షణ, జ్ఞాన ప్రబోధన లక్ష్యాలుగా విష్ణుమూర్తే దత్తాత్రేయుడిగా అవతరించినట్లు భావిస్తారు. మార్గశిర శుక్ల చతుర్దశినాడు యోగీశ్వరుడైన దత్తాత్రేయుడు ఆవిష్కారమైనట్లు చెబుతారు.
అత్రి, అనసూయ దంపతులకు దత్తుడు జన్మించాడు. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే తాపత్రయాల్ని తొలగించుకున్న మహర్షి అత్రి. ఆయన సతీమణి అనసూయ. త్రిమూర్తుల్ని పసిపాపలుగా మార్చి, వారిని పొత్తిళ్లలోకి తీసుకొని ఆకలి తీర్చిన ఉత్తమ ఇల్లాలు. ఆ దంపతుల పుత్రుడిగా, కారణజన్ముడిగా శ్రీహరి తనను తాను దత్తం చేసుకున్నాడు. అందుకే దత్తుడయ్యాడు. అత్రికి కుమారుడు కాబట్టి ఆత్రేయుడయ్యాడు. ఆ స్వామినే దత్తాత్రేయుడిగా ఆరాధించుకుంటున్నాం.
దత్తాత్రేయుడు ‘విశ్వ గురువు’ అని ‘శాండిల్యోపనిషత్తు’ వర్ణించింది. బ్రహ్మ జ్ఞానశక్తి, విష్ణువు రక్షణ విధి, పరమేశ్వరుడి యోగతత్వాల మేలు కలయికే దత్తాత్రేయ ఆకృతి. గురుదత్తుడు శ్రీవిద్యకు జగదాచార్యుడు. యోగమార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే మూడు అంశాలు దత్తాత్రేయ అవతార ప్రధాన ధ్యేయాలు. చతుర్ముఖాలు కలిగిన ఆవును వాహనంగా చేసుకున్న త్రిముఖ దత్తుడు మునిపుంగవుడిగా గోచరమవుతాడు. ఆ స్వామి వైరాగ్యమూర్తిగా తేజరిల్లుతాడు. ఎలాంటి ఆయుధాలూ లేకుండా, ప్రసన్న వదనంతో చిరునవ్వులు చిందిస్తూ, భక్తాభీష్ట వరదాయకుడిగా ప్రకటితమవుతాడు. సమస్త సన్మంగళ సాత్విక రూపుడిగా భాసిస్తాడు. జ్ఞానప్రభల్ని వెదజల్లుతుండే దత్తుడు ‘యోగమార్గ విశిష్ట ప్రవర్తకుడు’ అని భాగవతంలోని ఏకాదశ స్కందం పేర్కొంది.
మేడిచెట్టు కింద మహిమాన్విత మూర్తిగా విలసిల్లుతాడు దత్తుడు. మేడిపండు పైకి మేలిమిగా మిసమిసలాడుతుంటుంది. లోపల పురుగులతో నిండి ఉంటుంది. అలాగే ఈ ప్రపంచం పైకి అందంగా కనిపిస్తుంటుంది. అంతర్గతంగా పలు సమస్యలు పట్టి పీడిస్తుంటాయి. అటువంటి అవరోధాల్ని అధిగమించడానికే దత్తాత్రేయుణ్ని శరణు వేడాలంటారు. ఆయన సమక్షంలో ఉండే నాలుగు ముఖాల ఆవు చతుర్వేదాలకు సంకేతం. స్వామి చెంత సంచరించే నాలుగు శునకాలు చతుర్విధ పురుషార్థాలకు సూచికలు. జ్ఞాన, భక్తి, యోగ తత్వాల సమ్మిళితంగా భక్తుల్ని చైతన్యవంతుల్ని చేయడమే దత్తాత్రేయ అవతార ప్రయోజనమని ‘మార్కండేయ పురాణం’ చెబుతోంది.
మానవ మనుగడకు అత్యవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రకృతి నుంచి వివేక హృదయంతో గ్రహించాలి. అంతర్వీక్షణతో వ్యవహరించాలి. తన ఆత్మే తనకు గురువుగా మారిందంటాడు దత్తాత్రేయుడు. ఉత్తమ జన్మ పొందిన మనిషి, సాటి జీవరాశుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలా అభ్యాసం చేసి, వాటిని జీవన గమనంతో సమన్వయం చేసుకున్నప్పుడే అతడు మహనీయుడు కాగలడన్నది దత్త సందేశం.