సుభాషితాలుసుభాషితాలు 


దీపం జ్యోతి పరఃబ్రహ్మ దీపం సర్వతమోపహం!
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే!!

దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగాను, మనోవికాసానికి ,ఆనందానికి , సద్గుణ సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుంది. ఎక్కడ దీపం ఉంటుందో అక్కడ చీకటనే అంధకారం ఉండదు. అందుకే హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యమైనా దీపాన్ని వెలిగించడంతో మొదలు పెడతారు. అంతే కాక మనం చేసే నిత్యపూజలు, కైంకర్యాలు ఇలా అన్ని కార్యక్రమాలలో తొలిపూజను అందుకునేది దీపమే. అందుకే మనం పూజ చేసేటప్పుడు దీపాన్ని వెలిగించగానే "దీప రాజాయ నమః " అంటాము.


అగ్నితత్వం


పంచభూతాల్లో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని అఖిల ప్రాణ కోటి మనుగడకు ఉపకరించే తేజస్సు, ఓజాస్సును అందిస్తుంది. అంతే కాక మనం తీసుకునె ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తిని ఇస్తుంది. ఈ దీపాల వెలుగుని మనం సరిగ్గా గమనిస్తే నీలం,పసుపు,తెలుపు రంగులు మనకు కనిపిస్తాయి.

ఈ మూడు రంగులు సత్య,రజో,స్తమో గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి. ఈ మూడు రంగులు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతీలుగా పౌరాణికులు భావిస్తారు. దీపాన్ని వెలిగించడమంటే విఙ్ఞానం,వివేకం, వినయాన్ని సందేశాత్మకంగా తీసుకోవడమని పెద్దలు చెబుతారు. దక్షిణాయ కాలంలో మరణించినవారు ఈ నరకం నుంచి తప్పించుకోవడానిఒకి ఉత్తరాయణ పుణ్యకాలంలో వెలిగించిన జ్యోతిని దానం చేయాలని చెబుతారు. మరణం మన చేతుల్లో లేని కార్యం కాబట్టి ఉత్తరాయణకాలంలో అందులోనూ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఇస్తే ఉత్తమోత్తమం అని పెద్దలు చెబుతారు .


పితృదేవత కోసం


ప్రదోష వేళలో దక్షిణ దిశగా నిలబడి దీపాన్ని వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు స్వర్గం వెళ్ళేందుకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.ఆ దీపాన్ని వెలిగించి ఇంటికి వచ్చిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని తీపి పదార్ధాన్ని ఆరగించాలి.


లక్ష్మీదేవి ఆవాహన


సాయంత్ర సమయాన నువ్వుల నూనెలతో ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. దీపపు వెలుగుతో దరిద్రం, దుఃఖాలు,కష్టాలు వంటివి దూరంగా తరిమి వేయబడతాయి.