Banner AD

Just Watch

>

పంచముఖి హనుమంతుడు


పంచముఖి హనుమంతుడు భగవాన్ ఆంజనేయుడి ఐదు తలల వెనక కథ



 పంచముఖి హనుమంతుడు  ఐదు తలల అవతారం. హనుమాన్ భగవానుడి విశ్వవిరాట్ రూపమే ఈ పంచముఖి హనుమంతుడు.

పంచముఖి హనుమంతుడికి రెండు రకాల రూపాలున్నాయి. 

మొదటి రూపంలో అన్ని తలలు హనుమంతుడివే కాగా,

 రెండవ రూపంలో ఐదుతలలు హయగ్రీవుడు, నరసింహుడు, హనుమంతుడు, వరాహ మరియు గరుడ తలలు కలిగి ఉంటాయి. 

వీటిల్లో హయగ్రీవ, నరసింహ, వరాహాలు మహావిష్ణువు అవతారాలు. అందుకని పంచముఖి హనుమంతుడిని మహావిష్ణువు మరియు హనుమానుడి కలిపిన అవతారంగా పూజిస్తారు. శ్రీ పంచముఖి హనుమంతుడు, ఆంజనేయుడి తాంత్రిక రూపంగా భావిస్తారు.

హనుమంతుడి ఐదు తలల అర్థాలు:

తూర్పు ముఖ ఆంజనేయుడు మానవులకు ఇష్టసిద్ధికి,

దక్షిణముఖ కరాళ ఉగ్రవీర నరసింహ మానవులకి అభీష్ట సిద్ధిని,

పశ్చిమ ముఖ మహావీర గరుడ సకల సౌభాగ్యాలను,

ఉత్తర ముఖ లక్ష్మీవరహా ధనప్రాప్తిని,

ఊర్థ్వముఖ హయగ్రీవుడు సకల విద్యలలో జయప్రాప్తిని అందిస్తారు.

మరో కథనం ప్రకారం ఐదు ముఖాలు ఐదు రకాల ప్రార్థనలను సూచిస్తాయి –

మననం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం.

శ్రీ పంచముఖ హనుమంతుడి జననం


ఈ శ్రీ పంచముఖ హనుమంతుడి ఆవిర్భావం కథ రామాయణంలో ఉంది. రామయణ కథ ప్రకారం, యుద్ధసమయంలో, రావణుడు యుద్ధం గెలవడానికి మహిరావణుడి సాయం తీసుకున్నాడు. మహిరావణుడు పాతాళలోకానికి రాజు. మహిరావణుడు రాముడిని, లక్ష్మణుడిని అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్ళాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్ళి వారిద్దరిని రక్షించాలనుకుంటాడు.

భగవాన్ ఆంజనేయుడు మహిరావణుడితో భీకర యుద్ధం చేసినా అతన్ని ఓడించలేకపోతాడు. మహిరావణుడిని చంపాలనుకుంటే, ఐదు వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పాలని తెలుసుకుంటాడు. మహిరావణుడి జీవితం 3 దీపాలలో నిలిచి ఉన్నది. ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పాలంటే, హనుమంతుడు అప్పుడు పంచముఖి హనుమంతుడి అవతారం దాలుస్తాడు-

 హనుమాన్, హయగ్రీవ, నరసింహ, గరుడ  మరియు వరాహ ముఖాలతో హనుమంతుడు  ఐదు దీపాలను ఆర్పివేసి మహిరావణుడిని సంహరిస్తాడు.

తమిళ కంభ రామాయణంలో, హనుమంతుడి ఐదు తలల విశిష్టతను తెలియచేస్తూ ఇలా ఉంది 

హనుమంతుడు ఆకాశంలో ఎగిరాడు, ఆకాశం కూడా పంచభూతాలలో ఒకటే.

హనుమంతుడి ధ్యేయం సీతమ్మను వెతకడం. సీత భూమాతకి పుత్రిక. భూమి కూడా పంచభూతాలలో ఒకటి.

ఆంజనేయుడు సీతమ్మను వెతకడానికి సముద్రం దాటాడు. సముద్రం (నీరు) కూడా పంచభూతాలలో ఒకటే.

హనుమంతుడు లంకాదహనం చేసాడు. అగ్ని పంచభూతాలలో ఒకటి.

హనుమంతుడు పంచభూతాలలో ఒకటైన గాలి(పవనం)కి కొడుకు.



హనుమంతుడ్ని పూజించటానికి ఆయన విగ్రహం చుట్టూ 5సార్లు, 14 సార్లు, 23 సార్లు, ఐదు గుణకాలలో ప్రదక్షిణం చేయటం మంచిదని చెప్తారు.