శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప కవచరహితం


తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు కవచరహితంగా దర్శనమిస్తారు. 

జూన్‌ 24 నుండి 26వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరుగనున్న విషయం విదితమే.

జూన్‌ 19వ తేదీ మంగళవారం రెండో గంట తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బంగారు కవచాన్ని తొలగిస్తారు.

 సంవత్సరం పొడవునా అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు కవచాలను తొలగించి శుద్ధి చేస్తారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు కవచరహితంగా సేవల్లో దర్శనమిస్తారు.

జ్యేష్టాభిషేకంలో భాగంగా మొదటిరోజు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచం, రెండో రోజు ముత్యాలకవచం, మూడో రోజు తిరిగి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. అప్పటినుండి సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు బంగారు కవచంతోనే ఉంటారు.

జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్‌ 24న వసంతోత్సవం, జూన్‌ 25న విశేషపూజ, వసంతోత్సవం, చివరిరోజైన జూన్‌ 26న అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.