శ్రీ వేంకటేశ్వరస్వామివారి నాణేలను వేగవంతంగా మార్పిడి

భక్తులు సమర్పించిన నాణేలను వేగవంత మార్పిడికి ఆదేశం – తిరుపతిలో నాణేల పరకామణిని తనిఖీ చేసిన టిటిడి ఛైర్మన్‌ శ్రీ పూట్టా సుధాకర్‌ యాదవ్‌

తిరుపతి, 2018 జూన్‌ 21: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన నాణేలను వేగవంతంగా మార్పిడి చేయాలని టిటిడి ఛైర్మన్‌ శ్రీ పూట్టా సుధాకర్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని నాణేల పరకామణిని గురువారం టిటిడి ఛైర్మన్‌ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలలోని నాణేలు పేరుకుపోకుండా లెక్కింపు పూర్తి చేసి బ్యాంకులలో డిపాజిట్‌ చేయాలన్నారు. విదేశీ, స్వదేశీ నాణేల విభజన, లెక్కింపును త్వరితంగా పూర్తిచేయాలన్నారు. అవసరమైతే రిజర్వు బ్యాంక్‌ అధికారులతో మాట్లాడేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అంతకుముందు ఆయన అధికారులతో కలిసి స్వదేశీ నాణేలు, విదేశీ నాణేల పరకామణిని, ట్రేజరిని పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, విజివో శ్రీమతి సదాలక్ష్మ్లీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.