టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

 టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

శ్రీరమణదీక్షితులు స్థానంలో టిటిడి ఆగమ సలహామండలి సభ్యులుగా శ్రీఎన్‌.వేణుగోపాల దీక్షితులను నియమించడం జరిగింది.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ గర్భగుడిపై విమానగోపురానికి రాగిరేకులపై బంగారుపూత పూసేందుకు రూ.32.26 కోట్లు మంజూరుకు ఆమోదం.

రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరిలో పేదలైన హిందూ భక్తులకు ప్రారంభించిన ”దివ్యదర్శనం” పథకానికి రవాణా సౌకర్యం కొరకు 50 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, 50 శాతం వ్యయాన్ని టిటిడి ఖర్చు చేస్తోంది. ఇందుకోసం ఎపిఎస్‌ఆర్‌టిసికి రూ.1.25 కోట్లు చెల్లించేందుకు ఆమోదం.

గతేడాది ఏప్రిల్‌ నుండి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు టిటిడి తలనీలాలకు నిర్వహించిన ఈ-వేలంలో రూ.133.32 కోట్లు లభించింది.

మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తిరుమలలో దాదాపు రూ.15 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదించడమైనది.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం వద్ద మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భాగంగా మొదటి విడత అభివృద్ధి పనులకు రూ.36 కోట్లు మంజూరుకు ఆమోదం. అదేవిధంగా, యాత్రికుల వసతిగృహాల నిర్మాణం కోసం రూ.5.25 కోట్లు మంజూరు.

ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం దుడ్డుకూరు గ్రామంలోని శ్రీచెన్నకేశవస్వామివారి ఆలయ పునరుద్ధరణ పనుల కోసం రూ.25 లక్షలు మంజూరు.

అనంతపురం జిల్లా పరిగి మండలం మోద గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.75 లక్షలు, 

రొద్దం మండలం రొద్దకంబ ఆలయ సమీపంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.75 లక్షలు, 

హిందూపురం మండలంలోని చౌలూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయ పునర్నిర్మాణపనులకు రూ.27 లక్షలు మంజూరు.

ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవోలు శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీపోల భాస్కర్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీబోండా ఉమామహేశ్వర్‌రావు, శ్రీరాయపాటి సాంబశివరావు, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీసండ్ర వెంకటవీరయ్య, శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ శ్రీమతి వైవి.అనూరాధ, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ అశోక్‌రెడ్డి, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ పాల్గొన్నారు.