దేవుడంటే ఎలా ఉంటాడో

దేవుడంటే ఎలాఉంటాడో
కొన్ని రూపాలు మచ్చుకు మాత్రం-
                     
బస్సు ప్రయాణంలో కలిసిన మిత్రుడు మాటల సందర్భంలో..
"మీరు దేవుణ్ణి నమ్ముతారా" అని అడిగాడు.

'నమ్ముతా'నన్నాను నేను
అతడు నొసలు చిట్లిస్తూ..

"అయితే మీకు దేవుడు కనిపిస్తాడా" అన్నాడు
నిస్సందేహంగా.. 'కనిపిస్తాడు' అన్నా

అతడు వెటకారంగా నవ్వుతూ..
"నాకూ ఓ సారి చూపించొచ్చు కదా" అన్నాడు

'మీకు కనిపిస్తాడో..లేదో తెలియదు కానీ నాకు మాత్రం దేవుడు కనిపిస్తాడు' అన్నాను
"అచ్ఛా..! ఎప్పుడు? ఎక్కడ? ఎలా?" అంటూ ప్రశ్నించాడు..
వెటకారం రెట్టింపవగా..!



నేనన్నాను....
"స్వచ్ఛత తప్ప ఏ మాలిన్యమూ లేని పసిపాపాల చిరునవ్వుల్లో..

తనువు చిక్కి శల్యమైపోతున్నా
నేల దున్ని పదిమంది ఆకలి తీర్చే అన్నదాతల స్వేదంలో..

జన్మభూమి ఋణం తీర్చుకొనుటకు
ప్రాణాలను సగర్వంగా అర్పించగలిగే వీర జవానుల దేశభక్తిలో..

శ్రమైక జీవన సౌందర్యానికి ఏకైక చిరునామా
కష్టజీవి..కార్మికుని శ్రమ ఆరాటంలో..

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న
విలువల ప్రాణం నిలిపే సంజీవని కోసం వెతుకులాడుతున్న గురువుల నిస్వార్థ సేవలో..

వేళకాని వేళ జనారణ్యంలో చిక్కుకున్న
ఆడబిడ్డను మృగాళ్ల బారిన పడకుండా క్షేమంగా తన గూటికి చేరేందుకు సాయమందించే పుణ్యాత్ముల్లో..

తాను మరణపుటంచుల్లో ఉన్నప్పుడు
అవయవదానం చేసి సాటి మనిషికి ప్రాణంపోసి అమరత్వం పొందే త్యాగధనుల్లో..

ఇవ్వడమొక్కటి తప్ప ఆశించడం తెలియని
ఈ ప్రకృతి రమణీయతలో..
ప్రకృతిలో మిళితమైన జీవరాశిలో..
పంచభూతాల్లో..
నాకెప్పుడూ దేవుడు కనిపిస్తూనే ఉంటాడు..
మరి మీకు?"

నేను మాట్లాడ్డం ఆపా..

ఎందుకో తెలియదు..
అతని ముఖంలో వెటకారం మాయమై
నిర్మలమైన చిరునవ్వు కనిపించింది!

"మిత్రమా..! ఇప్పుడు నీలోనూ నాకు దేవుడు కనిపిస్తున్నాడు" అన్నాన్నేను..

అతడు మౌనంగా బస్సు దిగి వెళ్తూ..
నన్ను చూసి మరోసారి నవ్వాడు!
ఇప్పుడతడి నవ్వులో నాకు 'తృప్తి' కనిపించింది!!...
ప్రేమను అందించే ప్రతి మనిషిలో .. ఇంకా చెప్పాలంటే అన్ని రూపాలు ఆయనవే .