తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లుతిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి


 తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్‌ 24వ తేదీ ఆదివారం నుండి మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉత్సవబేరంగా పిలిచే శ్రీ మలయప్పస్వామివారికి శ్రీ మలయకునియ నిన్ర పెరుమాళ్‌, ఉత్సవమూర్తి అని పేర్లు ఉన్నాయి. ఈ ఉత్సవమూర్తుల ప్రస్తావన క్రీ.శ.1339 నాటి శాసనంలో కనిపిస్తోంది. పర్వతమైదానాల్లో దొరికినందున ఈ విగ్రహాలను ‘మలయకునియనిన్ర పెరుమాళ్‌’ అని పిలుస్తున్నారు. ఈ విగ్రహాలు దొరికిన స్థలాన్ని ‘మలయప్పకోన’ అంటారు. ఆనాటి నుండి శ్రీదేవి, భూదేవితో కలిసి శ్రీమలయప్పస్వామివారు కల్యాణోత్సవం వంటి ఉత్సవాల్లోను, ఊరేగింపుల్లోను, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం వంటి వార్షిక ఉత్సవాల్లోను దర్శనమిస్తున్నారు. శ్రీ మలయప్పస్వామివారి విగ్రహం 14 అంగుళాల పద్మపీఠంపై 3 అడుగుల ఎత్తు ఉంది. అమ్మవారి విగ్రహాలు 4 అంగుళాల పీఠంపై 30 అంగుళాల ఎత్తు ఉన్నాయి. శ్రీ మలయప్పస్వామి వారికి కుడివైపున శ్రీదేవి, ఎడమవైపున భూదేవి ఉంటారు.

తరతరాలుగా అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనాలు నిర్వహిస్తుండడం వల్ల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు తరుగుపడకుండా, అరిగిపోకుండా పరిరక్షించేందుకు జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో మూడు రోజుల పాటు ఉదయం 8 నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు సహస్రదీపాలంకార సేవ, ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు.


ఉదయం కార్యక్రమాల్లో భాగంగా ముందుగా ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహిస్తారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేస్తారు. ఆ తరువాత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో వేదపండితులు పురుషసూక్తంతోపాటు శ్రీసూక్తం, భూసూక్తం తదితర పంచసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు మొదటిరోజు సాయంత్రం వజ్రకవచంతో, రెండోరోజు సాయంత్రం ముత్యాలకవచంతో, మూడోరోజు సాయంత్రం స్వర్ణకవచంతో భక్తులకు దర్శనమిస్తారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు బంగారు కవచంతోనే ఉంటారు.