కేవలం నిరీక్షించండి..గోరఖ్ నాథుడి గురించి ఒక కథ


 మత్స్యేంద్రనాథుడు, గోరఖ్ నాథుడి గురించి ఒక కథ ఉంది. మత్స్యేంద్రనాథుడు ఒక గొప్ప యోగి. ఈయనని సహజంగా అందరూ శివాంశ గానే భావించేవారు. దీని అర్థం శివుడు మళ్ళీ జన్మించాడని కాదు. మనం ఆయనను శివ స్వరూపం అన్నప్పుడు, ఆయన జ్ఞానం, సామర్థ్యంలో శివుడికి ఏమాత్రం తీసిపోరని అర్థం. మనకి శివుడిలో ఉన్న ఆసక్తి ఆయనలో ఉన్న స్వభావాల బట్టే కదా ..! మత్స్యేంద్రనాథుడి లక్షణాలు అందుకు ఎంతో దగ్గరగా ఉండేవి. 
అందుకే ప్రజలు ఆయనను సాక్షాత్తూ శివుడే అని అన్నారు. ఆయనతో గోరఖ్ నాథుడు అనే ఒక శిష్యుడు ఎంతో సాన్నిహిత్యంతో ఉండేవాడు.
ఒకసారి మత్స్యేంద్రనాథుడు, గోరఖ్ నాథుడితో నడుచుకుంటూ వెళుతూ, ఒక చిన్న పిల్ల కాలువను దాటారు. మత్స్యేంద్రనాథుడు ఒక చెట్టు క్రింద కూర్చొని,” నాకు కాసిని మంచినీళ్ళు తీసుకురా” అని అన్నారు. 
గోరఖ్ నాథుడు మంచి నీళ్ళ కోసం పరుగెత్తాడు. గోరఖ్ నాథుడు ఎలాంటివాడంటే, ఆయన గురువు ఏమి అడిగినా సరే ఒక క్షణంలో చేసెయ్యాలనుకుంటారు. ఈయన ఆ చిన్న పిల్ల కాలువ దగ్గరకు వెళ్లారు. అప్పుడే కొన్ని ఎడ్ల బండ్లు దాటడంవల్ల నీరు మురికిగా ఉండడం చూసారు. తిరిగి గురువు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి, ఇక్కడ నీరు మట్టిగా ఉంది, ఒక పదినిముషాల దూరంలో మరొక నది ఉంది, నేను అక్కడికి వెళ్లి నీళ్ళు తెస్తాను” అని చెప్పారు.
అందుకు మత్స్యేంద్రనాథుడు, “వద్దు, ఈ కాలువనుంచే మంచినీళ్ళు తీసుకుని రా.. అదే చోటునుండి" అని చెప్పారు. “ కానీ, అది అక్కడ మట్టిగా ఉంది “ అన్నాడు  గోరఖ్ నాథుడు. దానికి  మత్స్యేంద్రనాథుడు, “కానీ, నాకు అక్కడినుంచే నీళ్ళు కావాలి, అదే చోటునుంచి. నాకు దాహం కూడా వేస్తోంది” అన్నారు.
 సరే, గోరఖ్ నాథుడు మళ్ళీ పరుగెత్తుకు వెళ్లి, అది ఇంకా మట్టిగానే ఉండడం చూశారు. ఆయనకు ఏమి చెయ్యాలో తెలియలేదు. తిరిగి గురువు దగ్గరకు పరుగెత్తుకుని వచ్చాడు. మత్స్యేంద్రనాథుడు ”లేదు నాకు ఆ కాలువ నుంచే నీళ్ళు కావాలి” అని అనడంతో ఏం చెయ్యాలో తోచక, అతను తిరిగి అక్కడికే వెళ్ళాడు. 
ఈపాటికి నీళ్ళు కొంచెం సర్దుకోవడం మొదలుపెట్టాయి. అతను నిరీక్షించడం మొదలు పెట్టాడు. ఐదు నిముషాల తరువాత, నీళ్ళు శుభ్రంగా, స్వచ్చంగా తయారయ్యాయి. ఈయన ఆ నీటిని ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో గురువుగారి వద్దకు తీసుకునివచ్చి ఆయనకు ఇచ్చాడు.
 మత్స్యేంద్రనాథుడు, ఆ నీటిని పక్కన పెట్టారు. దానిని త్రాగలేదు. ఆయనకి దాహం వెయ్యడంలేదు. గోరఖ్ నాథుడు ఎలాంటివాడంటే, మీరు ఆయనకు ఒక మంత్రమిచ్చి పదిసార్లు జపించమంటే, ఆయన దానిని పదివేలసార్లు చేస్తారు. అటువంటివారు ఆయన..! మీరు ఆయనకి ఏమి చెప్పినాసరే, ఎంతో గొప్ప ఉత్సాహంతో చేస్తారు. ఇది ఒక అద్భుతమైన లక్షణం.
కానీ, ఆయన మరో పార్శ్వం లోనికి వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది. అందుకు, దానిని మత్స్యేంద్రనాథుడు ఆయనకు ఈ విధంగా తెలియపరచారు. “నువ్వు పరుగెత్తవలసినదంతా పరుగేత్తేశావు. తీక్షణతో ఏవైతే చెయ్యాలో, అవన్నీ బాగా చేశావు.
 ఇప్పుడు సమయం ఆసన్నమైనది. కేవలం నిరీక్షించాలి. అప్పుడు, అదే అంతా స్ఫటికంలాగా స్పష్టంగా మారిపోతుంది” అని అన్నారు. శబ్దం అనేది నీ మనస్సులో ఉన్నదే! ఏవైతే మోగుతున్నాయో, ఒకవేళ మీరు నిద్రపోతే, అవుతున్న శబ్దాలు మీకేమీ పట్టవు కదా ?   బయట ఎటువంటి శబ్దాలు ఉన్నా; మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, వాటి గురించి మీకేం పడుతుంది?? 
మీరు సృష్టించుకునే శబ్దాలవల్లే మీ మనస్సంతా కూడా ఇలా మురికిగా ఉంది.. అందుకని కేవలం నిరీక్షించండి. 
అంతా మరొకసారి స్పష్టంగా మారిపోతుంది. అన్ని శబ్దాలూ సద్దుమణిగినప్పుడు.. మీరు వాటికి అర్థాలను తగిలించడం మానేసినప్పుడు.. అన్నీ వాటంతటవే విడిపడిపోతాయి.