ఆగస్టు 11 నుంచి 16 వరకు స్వామి వారి దర్శనం నిలిపివేతఆగస్టు 11 నుంచి 16 వరకు మహాసంప్రోక్షణం 
విశిష్ట క్రతువు నేపథ్యంలో దర్శనాలపై 
తితిదే ధర్మకర్తల మండలి నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తుల దర్శనాలు ఆరు రోజులపాటు నిలిచిపోనున్నాయి. ఆగస్టు 11నుంచి 16వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టం సజావుగా సాగేందుకు దర్శనాలు నిలిపివేయనున్నారు.

 17వ తేదీ ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రకటించారు. శనివారం నిర్వహించిన మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

ఆగస్టు 9న సాయంత్రం ఆరింటి నుంచి కంపార్టుమెంట్లలోకి భక్తులను అనుమతించకుండా నిలిపివేస్తామని, ఆలోపు వేచి ఉన్న భక్తులందరికీ పదో తేదీన దర్శనం కల్పిస్తామని వివరించారు. యాత్రికులు ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని సహకరించాలని విన్నవించారు.

12ఏళ్లకోసారి నిర్వహించే ఈ క్రతువు విశిష్టత ఇది.. 


 ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్ఠ. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ చేస్తారు. ప్రతి ఆలయంలో ఈ క్రతువును నిష్ఠాగరిష్ఠంగా చేస్తారు. సజీవంగా ఉండే ఓ దేవతామూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు.

 తిరుమల ఆలయంలో స్వామివారికి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినపుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. 

వీటివల్ల కొన్నిసార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇది అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే మరమ్మతు చేస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం స్వామి అంశను పూర్ణకుంభంలోకి ఆవాహనం చేస్తారు. ఇదే సంప్రోక్షణలో కీలకం.

 స్వామి అంశను పూర్ణకుంభంలోకి ప్రవేశపెట్టే క్రతువును భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ పూర్ణకుంభాన్ని పరకామణి ప్రాంతంలో నిర్దేశిత స్థానంలో ప్రతిష్ఠిస్తారు. యాగశాలగా మార్చే ఈ మండపాన్నే సంప్రోక్షణ జరిగినన్నీ రోజులు బాలాలయంగా పిలుస్తారు.

 గర్భాలయంలో మూలవిరాట్టుకు చేసే ఉపచారాలు, కైంకర్యాలన్నీ అంతే శాస్త్రోకంగా బాలాలయంలోని పూర్ణకుంభంలో అవాహనమైన స్వామికీ చేస్తారు.  ఓ కలశంలో సుగుణమూర్తిగా, అగ్నిహోత్రంలో నిర్గుణమూర్తిగా స్వామిని ప్రతిష్ఠించి కొలుస్తారు. ఈ సమయంలో మూలవిరాట్టుకు అలంకరణ ఉండదు.


 గర్భాలయంలో మరమ్మతుకు సిమెంటు వాడరు. ఔషధాలు, ప్రాచీన రసాయనాలతో తయారుచేసిన 14 రకాల వజ్రలేపనాలు ఉపయోగిస్తారు. ఈ లేపనాలను శిల్పులు తయారుచేస్తారు. ఇది ద్రవరూపంలో ఉండే సిమెంటులాంటిది.


 భక్తులు నడిచే ఆలయంలోని ఇతర ప్రాంతాలలోనూ పుణ్యాహవచనం, శుద్ధి ప్రక్రియలను నిర్వహిస్తారు. సుగంధ లేపనాలు చల్లుతారు.

 బాలాలయంలో పూజా క్రతువులు, గర్భాలయంలో సంస్కరణలు చేసేందుకు 18 మంది రుత్విక్కులు ఉంటారు. నిత్యహోమాలు, శాంతి పూజల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వందలాది రుత్విక్కులు తిరుమలకు రానున్నారు.

 సంప్రోక్షణ పూర్తయ్యాక చివరగా స్వామివారి జీవాన్ని తిరిగి మూలవిరాట్టులోకి ప్రవేశపెట్టే క్రతువు చేపడతారు.

 2006లో మహాసంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి పరిమితంగా అనుమతించారు. 

అప్పట్లో తిరుమలకు సగటున రోజూ 50 వేల మంది వచ్చేవారు. ఇప్పుడా సంఖ్య 70 వేలకుపైగానే ఉంటోంది. దీంతో భక్తులపై పరిమితి విధిస్తే సమస్యలు వస్తాయన్న తలంపుతో తితిదే ఏకంగా దర్శనాలను నిలిపివేసింది.