వైభవంగా ముగిసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. 

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ నిర్వహించారు.

 ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణమండపంలోకి వేంచేపు చేసి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు.సాయంత్రం స్వామివారి ఊంజల్‌సేవ కన్నుల పండువగా జరిగింది. ఆ తరువాత లక్షీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా వాహన మండపంలోకి తీసుకొస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు. 

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఎఈవో శ్రీ శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌కుమార్‌ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.