హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం



తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. 

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కల్యాణోత్సవం కన్నులపండుగగా జరిగింది. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌ సేవ వైభవంగా జరిగింది.



అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. 




చారిత్రక ప్రాశస్త్యం :

శ్రీసుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది.


 దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తోంది.