శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభంతిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. 

ప్రతి ఆషాడ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, అర్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయ ప్రధానార్చకులు శ్రీ అర్చకం శ్రీనివాసదీక్షితులు ఆధ్వర్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. 

ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. 

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి వరలక్ష్మి, ఏఇఓ శ్రీ ఉదయభాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ జ్ఙానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.