శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా ముగిశాయి. 

ఉదయం మూర్తి హోమం, పరివార దేవతలకు పట్టు పవిత్ర పూజ, పవిత్ర సమర్పణ, మహాసంకల్పం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మహాభిషేకం, మూలవర్లకు పట్టు పవిత్ర సమర్పణ, విశేష ఉపచారాలు, మహానివేదన చేపట్టారు. అనంతరం స్వామివారికి మహాదీపారాధన నిర్వహించారు.సాయంత్రం పంచమూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీస్వామినాథస్వామి, శ్రీ మణిస్వామి, శ్రీ ఉదయస్వామి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.