వైభవంగా శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం
సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన మార్గంగా భక్తులు విశ్వసించే శ్రీవారి మెట్టు సమీపంలో గురువారం శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ ఉత్సవంలో పాల్గొన్న టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ క్రీ.శ 14వ శతాబ్దం నుండి శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు.


 1920వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి భారత ప్రభుత్వ పురావస్తుశాఖ పరిధిలోకి తెచ్చిందన్నారు. 

తిరుమల తరహాలో 2015వ సంవత్సరం నుంచి ఇక్కడ పార్వేట ఉత్సవాన్ని ప్రవేశపెట్టామని, అప్పటి నుంచి సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటిరోజు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

లోకసంరక్షణార్థం, భక్తుల భయాలను తొలగించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి పార్వేట మండపాన్ని మరింత అభివృద్ధిపరుస్తామని తెలిపారు. అనంతరం పార్వేట మండపం పరిసరాలను అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు చేశారు.ముందుగా ఉదయం 9 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు.

 ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు.

 ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సి.వెంకటయ్య, ఏఈవో శ్రీ ఆర్‌.శ్రీనివాసులు, ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, విజివో శ్రీ అశోక్‌ కుమార్‌ గౌడ్‌, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.