అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి


తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుండి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్ర‌మాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్టు టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలోని స‌మావేశ మందిరంలో శుక్ర‌వారం రాత్రి మ‌హాసంప్రోక్ష‌ణ ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

 ఆగస్టు 11వ తేదీన ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుందని, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. 
ఆ త‌రువాత 5 రోజుల పాటు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఇందుకోసం యాగశాలలో 28 హోమగుండాలను ఏర్పాటుచేశామ‌న్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో 43 మంది ఋత్వికులు, 150 మంది వేదపండితులు పాల్గొంటార‌ని, ఈ సందర్భంగా చతుర్వేద పారాయణం, గాన పారాయ‌ణం, ప్ర‌బంధ పారాయ‌ణం విశేషంగా జ‌రుగుతాయ‌ని వివ‌రించారు.

 ఆగస్టు 12న రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూల‌వ‌ర్ల‌తోపాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారని తెలిపారు. ఈ కుంభాలతోపాటు శ్రీ భోగ‌శ్రీ‌నివాస‌మూర్తి, శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీమ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి, శ్రీ చక్ర‌త్తాళ్వార్‌, సీత ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముల‌వారు, రుక్మిణి స‌త్య‌భామ స‌మేత శ్రీ‌కృష్ణ‌స్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారన్నారు. 

ఉప ఆల‌యాల్లోని జ‌య‌విజ‌యులు, ధ్వ‌జ‌స్తంభం, విష్వ‌క్సేనుడు, గ‌రుడాళ్వార్‌, ప్ర‌సాదం పోటులోని అమ్మ‌వారు, ల‌డ్డూపోటులోని అమ్మ‌వారు, భాష్య‌కారులు, శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామి, శ్రీ వేణుగోపాల‌స్వామివారు, శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి శ‌క్తిని కూడా కుంభంలోకి ఆవాహ‌న చేసి యాగ‌శాల‌కు తీసుకెళ‌తార‌ని తెలియ‌జేశారు.

ఆ త‌రువాత యాగ‌శాల‌లోనే ఉద‌యం సుప్ర‌భాతం నుండి రాత్రి ఏకాంత‌సేవ వ‌ర‌కు నిత్య కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారని జెఈవో తెలిపారు. 

ఆగస్టు 13, 14వ తేదీల్లో గర్భాలయంతోపాటు ఉప ఆలయాల్లో అష్టబంధనాన్ని సమర్పిస్తారని చెప్పారు. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తార‌ని, పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా అష్టబంధనాన్ని సమర్పిస్తారని వివ‌రించారు. అక్టోబ‌రు 3వ తేదీ వ‌ర‌కు మండ‌లాభిషేకం జ‌రుగుతుంద‌న్నారు. 

ఆగస్టు 15న మధ్యాహ్నం గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారని తెలిపారు. ఆగస్టు 16న ఉదయం పూర్ణాహుతి త‌రువాత ఈ సందర్భంగా శ్రీవారి మూలమూర్తికి, విమానగోపురానికి, ఉప ఆలయాల్లోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు వైభ‌వంగా మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తార‌ని వెల్ల‌డించారు.

ఆరు రోజుల్లో ల‌క్షా 94 వేల మందికి స్వామివారి ద‌ర్శ‌నం

యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కార‌ణంగా గంట‌కు 1500 మంది భ‌క్తుల‌కు మించ‌కుండా మాత్ర‌మే స్వామివారి ద‌ర్శ‌నం చేయించే అవ‌కాశ‌ముంటుంద‌ని జెఈవో తెలియ‌జేశారు. 

ఆగ‌స్టు 11న 50 వేల మందికి, 
ఆగ‌స్టు 12న 28 వేల మందికి, 
ఆగ‌స్టు 13న 35 వేల మందికి, 
ఆగ‌స్టు 14న‌ 35 వేల మందికి, 
ఆగ‌స్టు 15న 18 వేల మందికి, 
ఆగ‌స్టు 16న 28 వేల మందికి క‌లిపి ఆరు రోజుల్లో 1,94,000 మందికి మాత్ర‌మే ద‌ర్శ‌నం చేయించే అవ‌కాశ‌ముంద‌న్నారు. 

ప్ర‌తిరోజూ రాత్రి 12 గంట‌లకు ఆ త‌రువాత రోజు సామ‌ర్థ్యానికి అనుగుణంగా భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ విష‌యాన్ని భ‌క్తులంద‌రూ గుర్తించి టిటిడికి స‌హ‌క‌రించాని విజ్ఞ‌ప్తి చేశారు. మ‌హాసంప్రోక్ష‌ణ వ‌ల్ల శ్రీ‌వారి క‌రుణాక‌టాక్షాలు భ‌క్తులంద‌రికీ క‌లుగుతాయ‌ని ఈ సంద‌ర్భంగా జెఈవో తెలిపారు.

అంత‌కుముందు మ‌హాసంప్రోక్ష‌ణ రోజుల్లో యాగ‌శాల కార్య‌క్ర‌మాల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా భ‌క్తులకు ఎలా ద‌ర్శ‌నం క‌ల్పించాల‌నే విష‌య‌మై శ్రీ‌వారి ఆల‌యం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, విజిలెన్స్‌, ఐటి అధికారుల‌తో జెఈవో స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ ర‌వీంద్రారెడ్డి, ఏవిఎస్ఓలు పాల్గొన్నారు.