ఘనంగా ముగిసిన”బాలాలయ సంప్రోక్షణ”


 

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ సోమవారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

అంతకుముందు ఉదయం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ ఆలయంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి అనుమతించిన్నట్లు తెలిపారు.

 స్వామివారి గర్భాలయంలో జీర్ణోద్ధరణ పనుల కారణంగా మూలమూర్తి దర్శనం ఉండదని, జీర్ణోదరణ తర్వాత మూలమూర్తి దర్శనం కల్పించనున్నట్లు తెలియచేశారు. అంతవరకు భక్తులు బాలాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు.టిటిడి అనుబంధ ఆలయాలలో ప్రతి 12 సంవత్సరాలకోసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణనను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గతంలో 2006వ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు. ఆలయ జీర్ణోదరణలో భాగంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి గర్భాలయం, విమాన శిఖరం, రాజ గోపురం జీర్ణోద్ధరణ (ఆధునీకరణ పనులు) కార్యక్రమాలు దాదాపు నెల రోజుల పాటు జరుగనున్నాయని తెలిపారు. 

ఇందులో భాగంగా విమాన శిఖరంపై నూతన దేవతా మూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయడం, విమాన శిఖరం మరియు రాజగోపురంపై రాగి కళశాల స్థానంలో మొదటిసారిగా బంగారు పూత పూయబడిన కళశాలు అమర్చనున్నట్లు తెలియచేశారు.

అదేవిధంగా గర్భాలయం పైభాగాన గల బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న చెక్కను పరిశీలించడం, ఆలయంలో నూతన మకర తోరణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆలయంలోని ద్వారపాలకులు, గరుడాళ్వారు, ఆళ్వార్లు, ధ్వజస్తంభం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీఆండాళ్‌ అమ్మవారి ఆలయం, శ్రీప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాలలో మరమత్తులు చేపట్టనున్నాట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీసుబ్రమణ్యం, ఆలయ ప్రధానార్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.