శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆ తరువాత పూర్ణాహుతి, కుంభం చేపట్టి ఉత్సవమూర్తులను విమానప్రదక్షిణంగా సన్నిధికి వేంచేపు చేస్తారు. కుంభ ఆవాహన, ప్రోక్షణ తరువాత ఆచార్య అర్చక బహుమానం అందిస్తారు. ఆలయ మర్యాదలతో అర్చకుల తిరుమాళిగలో వదిలిపెడతారు.ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.