తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టిటిడి సారె


 

తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదివారం సమర్పించారు. 

ప్రతి సంవత్సరం ఆడికృతికను పురస్కరించుకుని శ్రీసుబ్రమణ్యస్వామివారికి టిటిడి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తోంది.

టిటిడి ఆధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయ ఛైర్మన్‌ శ్రీవి.జయశంకర్‌, ఆలయ ఈవో శ్రీ శివాజి, ఇతర ఆధికారులు ఘనస్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ఇతర ఆధికారులు పాల్గొన్నారు.


చారిత్రక ప్రాశస్త్యం :


భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తణి అత్యంత ప్రముఖమైనది. ఈ పుణ్యక్షేత్రంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తన ఇరువురు దేవేరులలో ఒకరైన శ్రీ వళ్ళీని పరిణయం ఆడినట్లు పురాణ ప్రాశస్య్తం. తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కి.మీ. దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసివున్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్తుతించే ”ఆరుపడైవీడు” లో ఒక్కటి. 

సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయదేవేరులైన శ్రీవళ్ళీ, దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేశన్‌గా వెలసి భక్తులచే పూజలు అందుకొంటున్నారు.

ఈ క్షేత్ర ప్రాశస్య్తంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపధ్యానికి వస్తే ఇక్కడ వెలసి వున్న పుష్కరిణిలో (నంది నది) సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మధనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు.

 ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృతిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్ళి మొక్కుబడలు చెల్లించడం విశేషం.