విజయ రహస్యాల్లో... క్రమశిక్షణ


ఆకాంక్షలు నెరవేరటం, ప్రయత్నాలు ఫలించటం, ప్రత్యర్థులను పరాజితుల్ని చెయ్యటం- ఇవన్నీ విజయాలే. కానీ, వీటిని సాధించడం అంత తేలిక కాదు. ప్రయత్నం చెయ్యకుండా కేవలం అదృష్టఫలంగా విజయం లభించాలనుకోవడం పేరాశ.

సృష్టిలో ఏదీ స్వతసిద్ధంగా గొప్పస్థితిలో ఉండదు. అమూల్య లోహాలైన వెండి, బంగారం, వెలకట్టలేని వజ్రాలు, రత్నాలు- ముడిపదార్థాలుగానే లభిస్తాయి. వాటిని వివిధ ప్రక్రియలద్వారా శుద్ధిచేసి విలువ పెంచుతారు.
మనిషి జ్ఞానమూ అంతే. అంచెలంచెలుగా అభ్యాసం, ఆచరణాత్మక కృషి, అధ్యయనాలతో వెలుగులీనుతుంది. జడంగా పడిఉన్న రాయిని శిలగా మలిస్తే పూజలందుకుంటుంది. అందుకే గీతలో, కృషితో నాస్తి దుర్భిక్షం అంటాడు పరమాత్మ.

అర్జునుడు సర్వోత్తమ ధనుర్ధారి కాగలగడానికి అవిశ్రాంత కృషి, సడలని పట్టుదలే కారణం. సాధకులు- రుషులు, మహర్షులు కావడానికి వారి దీక్ష, దక్షతలే దోహదపడతాయి.

మనిషి జీవితం క్రమశిక్షణతో ఆరంభం కావాలి. బాల్యంలో క్రమశిక్షణ గడ పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది లేదా సంరక్షకులది. విద్యార్థిదశలో గురువులే క్రమశిక్షణ అలవాటు చేస్తారు. మనసును నియంత్రించుకోగలగడమే క్రమశిక్షణ. శరీరంమీద అదుపు ఉన్న మనిషి పడిపోడు. మనసుమీద అదుపు ఉన్న వ్యక్తి  చెడిపోడు. ఇవి రెండూ క్రమశిక్షణకు సంబంధించిన మౌలిక సూత్రాలు.

విజయ రహస్యాల్లో మొదటిది క్రమశిక్షణ. మనం అనుకున్నది సాధించడానికి క్రమశిక్షణ పునాది వేస్తుంది. ఇక దాని ఆధారంగా ప్రగతి భవన నిర్మాణం జరగాలి.

ఏ నిర్మాణానికైనా అందుకు సంబంధించిన కౌశలం ఉండాలి. అది బుద్ధికుశలత, ఆత్మవిశ్వాసం, అంకితభావం, సడలని పట్టుదల, అవిశ్రాంత కృషితో సమకూడి ఉండాలి.

ఇవన్నీ ఉన్నాయి కనుకనే అర్జునుడు విజయుడు కాగలిగాడు. కేవలం ఆయుధ సంపత్తి ఉంటే చాలదు. దైవకృపా ఉండాలి. అలా ఉండాలంటే ధర్మ జీవన బద్ధులమై ఉండాలి. శ్రీకృష్ణుడి కృప వల్ల భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, శల్య, కృపాచార్య వంటి మహారథులతో, సాగర సమానమైన సేనావాహినులు కలిగి ఉన్న కౌరవుల్ని పాండవులు జయించగలిగారు. సాక్షాత్తు పరశురాముడి శిష్యుడైనా కర్ణుడు దైవోపహతుడై నశించాడు. అధర్మం ఎంతటి పరిణామంలో, ఎంతటి బలీయ శక్తులతో ఉన్నా ధర్మం ముందు ఓడిపోక తప్పదనే పరమ సత్యమే మహాభారత కథలో ప్రధాన సందేశం.

ప్రజ్ఞ ఎంత ఉన్నా దాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో తెలిసి వ్యవహరించడమే విజయాన్ని కట్టబెడుతుంది. ఆయుధాలు, నిలువెల్లా కవచం- ఎవర్నీ మహాయోధుణ్ని చెయ్యలేవు. ఇవేవీ లేకపోయినా ఆత్మవిశ్వాసం, సాధారణ ఆయుధాలతో సమరంలో విజయం సాధించవచ్చు.

మనలో ప్రతికూల ఆలోచనలు విజయానికి ప్రతిబంధకాలవుతాయి. కాబట్టి ప్రతికూల ఆలోచనలు దరిచేరకుండా చూసుకోవాలి. సంకల్ప దృఢత్వం ఉండాలి. నేను నా లక్ష్యాన్ని సాధించాలి, సాధించి తీరాలి, సాధించి తీరతాను- ఈ మూడూ విజయ రహస్యాలు. వీటిని అనుక్షణమూ గుర్తుంచుకుంటూ, ఏకదీక్షగా కృషి చేస్తే ఎవరికైనా విజయం తథ్యం.

ప్రతి మనిషిలో అమోఘ శక్తులు నిక్షిప్తమై, నిద్రాణస్థితిలో ఉంటాయి. వాటిని జాగృతం చేసి, ఉత్తేజితం చెయ్యడమే అసలైన విజయ రహస్యం. మన రంగం ఏదైనా, నిష్ఠగా పాటించాల్సిన సూత్రాలివే!