యాదాద్రి లక్ష్మీనారసింహుల బ్రహ్మోత్సవాలు


కోరిన కోర్కెలు తీర్చే భక్తజన బాంధవుడు.. స్వయంభువుగా వెలసిన యాదాద్రి లక్ష్మీనారసింహుల బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం సన్నద్ధమైంది. ముక్కోటి దేవతలు ఆహూతులుగా లోకకల్యాణం కోసం అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు 08 -03 నుండి ఈ నెల 18 వరకు 11 రోజుల పాటు  యాదాద్రికొండ సరికొత్త శోభను సంతరించుకోనుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 
9వ తేదిన ధ్వజారోహణం, 
10వ తేదిన మత్సావతార అలంకార శేవ, 
11వ తేదిన శ్రీ కృష్ణాలంకారము, 
12వ తేదిన వట పత్రశాయి అలంకార శేవ, 
13వ తేదిన గోవర్ధనగిరిధారి అలంకార శేవ, 
14వ తేదిన జగన్మోహిని అలంకార శేవ, రాత్రికి శ్రీ స్వామి వారి ఎదుర్కోల ఉత్సవము, 
15వ తేదిన శ్రీరామ అలంకారము, బాలాలయంలో కళ్యాణమహోత్సవము, ఆదేరోజు రాత్రి భక్తులకోసం కొండ కింద కల్యాణం, 
16వ తేదిన శ్రీ మహవిష్ణు అలంకారము, గరుడవాహన శేవ, దివ్య విమాన రథోత్సవము, 
17వ తేదిన చక్రతీర్థం, 
18వ తేదిన అష్టోత్తర శతఘాటాభిషేకము, శృంగార డోలోత్సవము ఉత్సవ సమాప్తి కానున్నాయి. 

శ్రీ వారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన 14న ఎదుర్కోలు, 15న కల్యాణం, 16న రథోత్సవం అధిక సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్వామి వారి దర్శనాలు కల్పించేలా ఉత్సవ వేడుకలను నిర్వహించుటకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనుల కారణంగా స్వామి బాలాలయంలో కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

పాత హైస్కూల్ గ్రౌండ్‌లో స్వామి వారి కల్యాణం…

శ్రీ వారి ఉత్సవంలో లోక కల్యాణార్థం జరుగు తిరుకల్యాణ మహోత్సవము శ్రీ వారి బాలాలయంలో ఉదయం 11 గంటలకు నిర్వహించి, భక్తకోటి దర్శనార్థం స్వామి వారి కల్యాణం అదే రోజు రాత్రి 8 గంటలకు జరుపించుటకు కొండ కింద పాత హై స్కూల్ గ్రౌండ్ వేదికగా కల్యాణ మహోత్సవము మూడవ సారి జరుగనుంది.


ఈ నెల 15న జరిగే తిరుకల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్‌ దంపతులు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున స్వామికి, అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.