శ్రీ కోదండ‌రామాల‌యం అభివృద్ధి ప‌నులు వేగ‌వంతం


ఒంటిమిట్టలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో మాస్ట‌ర్‌ప్లాన్‌లో భాగంగా చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఒంటిమిట్ట‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి ఈవో గురువారం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ నిర్దేశించిన ప‌నుల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌లోపు పూర్తి చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికి రూ.18 కోట్ల విలువైన ప‌నులు పూర్త‌య్యాయ‌ని, రూ.60.40 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన ప‌నులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని తెలిపారు. గ‌త మూడు నెల‌లుగా అభివృద్ధి ప‌నుల‌ను ప్ర‌తినెలా ప‌రిశీలిస్తున్నామ‌ని, పురోగ‌తి ఉంద‌ని వివ‌రించారు. 
క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద షెడ్లు, మ‌రుగుదొడ్ల ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఆల‌యం వ‌ద్ద కార్యాల‌య భ‌వ‌నం, మ‌రుగుదొడ్ల నిర్మాణం ఇత‌ర ప‌నులు చేప‌డుతున్నార‌ని తెలియ‌జేశారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని మ‌రింత ప‌టిష్టంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. 

ఏప్రిల్లో జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌పై ఈ నెలాఖ‌రులో జిల్లా యంత్రాంగంతో స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇందులో భ‌క్తుల‌కు ర‌వాణా, అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, వైద్యం త‌దిత‌ర వ‌స‌తుల‌పై చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. .

ఆల‌యంలోప‌ల ఫ్లోరింగ్‌, పోటు మ‌ర‌మ్మ‌తుల కోసం ఆర్కియాలజి విభాగం అధికారులు రూ.2.54 కోట్ల‌తో టెండ‌ర్లు ఖ‌రారు చేశార‌ని, త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తి చేస్తార‌ని ఈఓ వెల్ల‌డించారు. ఆల‌యం వెలుప‌ల లైటింగ్‌, అలంక‌ర‌ణ ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు. ఒంటిమిట్ట చెరువులో ట్యాంక్ బండ్‌, బోటింగ్ ఏర్పాటుకు ప‌ర్యాట‌క శాఖ అధికారులు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్టు చెప్పారు. జిల్లాలోని ప‌లు విభాగాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామ‌న్నారు. 

తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఇస్తున్న త‌ర‌హాలో ఇక్క‌డి మేళం సిబ్బందికి వేత‌నాలు ఇవ్వాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీర్మానించింద‌న్నారు.

అంత‌కుముందు వివిధ కార్యాల‌య భ‌వ‌నం, భ‌క్తులు వేచి ఉండే హాలు, క‌ల్యాణ‌వేదిక‌, అలంకార మండ‌పం, పుష్క‌రిణి, ఉద్యాన‌వ‌నం, మ‌రుగుదొడ్లు, ఆల‌య ప‌రిస‌ర ప్రాంతాల‌ను ఈవో, జెఈవో ప‌రిశీలించారు.