శ్రీ వికారినామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ


టిటిడి ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు తెలిపారు. 

టిటిడి రూపొందించిన శ్రీ వికారినామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజుతో కలిసి ఆవిష్కరించారు. 

తిరుమలలో శ‌నివారం సాయంత్రం శ్రీ‌వారి తెప్పోత్సవాల సందర్భంగా ఈ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.


ఈ పంచాంగాన్ని టిటిడి ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్‌ సిద్ధాంతి రచించగా వైఖానసాగమ పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు పరిష్కరించారు. మొత్తం 60 వేల ప్రతులను టిటిడి ముద్రించింది.

 శ్రీ వికారి నామ సంవత్సర పంచాంగాన్ని తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంచడమైనది. దీని ధరను రూ.55/-గా టిటిడి నిర్ణయించింది. టిటిడి ప్రతి ఏడాదీ ప్రతిష్టాత్మకంగా పంచాంగాన్ని ముద్రించి భక్తులకు అందజేస్తున్న విషయం తెలిసిందే.


వచ్చేవారం నుండి దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి సమాచార కేంద్రాలలో ఈ పంచాంగాన్ని అందుబాటులో ఉంచుతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.