కంచిలోని బంగారు, వెండి బల్లి వెనక ఉన్న రహస్యం?


బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. 

అదే విధంగా బల్లి మన శరీరంపై ఏ బాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. 

అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. 





మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తు రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.

అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్‌ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్‌ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు.





కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.

బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్‌ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.

బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా....కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.