టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షునిగా శ్రీ వైవి.సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం


టిటిడి ధర్మకర్తల మండలి 50వ అధ్య‌క్షునిగా శ్రీ వైవి.సుబ్బారెడ్డి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ‌వారి ఆల‌యంలోకి ప్ర‌వేశించారు. ఉద‌యం 11.47 గంట‌ల‌కు ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీ వైవి.సుబ్బారెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

 ఆ తరువాత శ్రీ వకుళామాత, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, శ్రీభాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో, జెఈవోలు క‌లిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.

శ్రీ‌వారి ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచుతాం : టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి సంబంధించి ఆగ‌మ‌శాస్త్రాలు, సంప్ర‌దాయాలు, నియ‌మాల‌ను గౌర‌విస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రింత పెంచేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ప్రమాణస్వీకారం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి కృప వ‌ల్లే టిటిడి ఛైర్మన్‌గా భక్తులకు సేవలందించే అవకాశం వ‌చ్చింద‌న్నారు. 

ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేయించేందుకు, అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వ‌స‌తి క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వివ‌రించారు. 

తిరుమ‌ల‌కు నీటి స‌మ‌స్య లేకుండా గౌ.. ముఖ్య‌మంత్రితో చ‌ర్చించి శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుగొంటామ‌న్నారు. టిటిడి ఉద్యోగులు, స్థానికుల స‌మ‌స్య‌ల‌ను ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో చ‌ర్చించి ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి, రాజ్య‌స‌భ స‌భ్యుడు శ్రీ విజ‌య‌సాయిరెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ బి.క‌రుణాక‌ర్‌రెడ్డి, టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.