దుర్గమ్మ చెంత వరుణయాగం


వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సస్యశ్యామలం కావాలని కోరుతూ విజయవాడలో వరుణయాగం నిర్వహిస్తున్నారు. కనకదుర్గ ఆలయం ఆధ్వర్యంలో దుర్గాఘాట్‌ వద్ద వరుణ జపాలు, పారాయణ గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. 

తొలుత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మతో స్థానాచార్య శివ ప్రసాదశర్మ గణపతి పూజ చేయించారు. 

ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ దుర్గగుడి అధికారులు చేపట్టిన వరుణ యాగం విజయవంతం కావాలని కోరారు. 

వర్షాలు సకాలంలో కురిసినప్పుడు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ 24న మల్లేశ్వరాలయ ప్రాంగణంలో వరుణ యాగం నిర్వహించనుండడం శుభ పరిణామని పేర్కొన్నారు. 
వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు వరుణ జపాలు, శతానువాక పారాయణ, విరాటపర్వ పారాయణ నిర్వహించారు. దుర్గగుడి ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్‌, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి, షణ్ముఖ శాస్త్రి పాల్గొన్నారు. 

దుర్గుగుడి ఈవో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవాలని ఈ వరుణయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 వేద విద్యార్థుల చేత యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. 

జూన్ నెల గడిచిపోతున్నా... వర్షాలు కురవకపోవడంతోనే ఈ వరుణయాగం నిర్వహిస్తున్నట్లు ఈవో స్పష్టం చేశారు. గతంలో యాగం నిర్వహించిన తర్వాత వర్షాలు కురిసినట్టు ఆమె తెలియజేశారు.