banner

పెళ్లిమంత్రాలకు అర్థం


పెళ్లిమంత్రాలకు అర్థం- పరమార్థంపెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?

పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...

పెళ్లంటే... ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం.

ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం.

మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం.
ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు...

వాటి అర్థాలపై ప్రత్యేక కథనం...

జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.

వైవాహిక జీవితానికి మూలం...

వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు. ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.

సంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి. అవి సమావర్తనం, కన్యావరణం, కన్యాదానం, వివాహహోమం, పాణిగ్రహణం, అగ్నిపరిచర్య, లాజహోమం, సప్తపది, నక్షత్ర దర్శనం.
-
సమావర్తనం
-
పెళ్లితంతులో అత్యంత ప్రధానమైన ‘సమావర్తనం’ అంటే తిరిగిరావటం అని అర్థం. గురుకులంలో విద్యపూర్తయ్యాక, ‘చరితం బ్రహ్మచర్యోహం’ అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి, గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడం. వివాహం చేసుకున్నాక, గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.

గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో...
రాత్రి సమయంలో స్నానం చేయను. వస్త్రరహి తంగా స్నానం చేయను వర్షంలో తడవను చెట్లు ఎక్కను నూతులలోకి దిగను నదిని చేతులతో ఈదుతూ దాటను ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను... అని పలికిస్తారు.
-
అంకురారోపణం
-
వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు. పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు. ఇందులోని పరమార్థం... ‘‘కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా! భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది. కాబట్టి నేలతల్లిని నమ్మండి, పంట సంతానాన్ని పొందండి’’ అని ధర్మసింధు చెబుతోంది.
-

కన్యావరణం

-
కన్యను వరించటానికి రావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని, వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు.
-

మధుపర్కం

-
మధుపర్కమంటే ‘తీయని పానీయం’ అని అర్థం. వరుడికి... తేనె, పెరుగు, బెల్లం కలిపిన మధురపదార్థం తినిపించాక, మధుపర్కవస్త్రాలను ఇస్తారు.
ఎదుర్కోలు సన్నాహం
ఇరుపక్షాలవారు శుభలేఖలు చదివి, ఒకరికొకరు ఇచ్చుకుని, పానకం అందచేస్తారు.
-
కన్యాదానం- విధి
-
వధువు తండ్రి, తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం. కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు...

''అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా
ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం''

‘కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో’
‘శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు... అంటూ వరుడి పాదాలు కడుగుతారు.

‘పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను. సమస్తదేవతలు, పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మకామార్థ సిద్ధికోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను’
‘ధర్మబద్ధంగా సంతానం పొందడానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను’
వధువు తండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు. అప్పుడు వరుడు ‘పృణేమహే’ (వరిస్తున్నాను) అంటాడు.

ఆ తరువాత వధువు తండ్రి వరునితో,
‘‘నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం
ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య
ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు అని పలికిన వధువు తండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు. ఇది వేదోక్త మంత్రార్థం. ఆ మాటకు అంత మహత్తు ఉంది. అలా అన్న తరవాతే వరుడి పాదాలను కడిగి, కన్యాదానం చేస్తారు.
-

యోక్త్రధారణం :

-
యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు. వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుముచుట్టూ కట్టి ముడి వేస్తాడు. ఈసమయంలో వరుడు...

''ఆశాసానా సౌమ నవ ప్రజాం సౌభాగయం తను మగ్నే,
రనూరతా భూత్వా సన్న హ్యే సుకృతాయ కమ్’’ 
అంటాడు.

ఉత్తమమైన మనస్సును, యోగ్యమైన సంతానాన్ని, అధికమైన సౌభాగ్యాన్ని, సుందరమైన తనువును ధరించి, అగ్నికార్యాలలో నాకు సహచారిణివై ఉండు. ఈ జీవిత యజ్ఞమనే మంగళకార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను... అనేది ఈ మంత్రార్థం.
-

జీలకర్ర , బెల్లం :

-
వధూవరులు... జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగం లో, బ్రహ్మరంధ్రం పైన ఉంచుతారు. ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం. ఈ సమయంలో ‘‘ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః’’ వరుణుడు, సోదరులను వృద్ధిపరచుగాక. బృహస్పతి, ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక. సూర్యుడు, ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక’’ అని అర్థం. ఇదే అసలైన సుముహూర్తం.
-

మంగళసూత్రధారణ :

-
(తాళి... తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. దానిని తాళిబొట్టు అంటారు. తాళవృక్షం నుంచి వచ్చింది).

వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడి వేస్తూ ఈ కింది మంత్రాన్ని పఠించాలి.

''మాంగల్య తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాశ్శతం''

నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు జీవించు... అని దీని అర్థం.


పాణిగ్రహణము


ధృవంతే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం॥

చంద్రుడు (మనస్సు), బృహస్పతి (కాయం), అగ్నిహోత్రుడు (వాక్కు) ... వీరు ముగ్గురి నుంచి బతిమాలి, వధువును తీసుకువస్తాడట వరుడు. అంటే త్రికరణశుద్ధిగా కాపురం బావుంటుంది అని అర్థం.

(కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు, కొంతకాలం గంధర్వుడు, కొంతకాలం అగ్ని కాపాడతారట. ఆ తరువాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట).
‘సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, గంధర్వుడు అగ్నికిచ్చాడు, నేను నిన్ను కాపాడవలసిన నాలుగవవాడను’ అని అభిమంత్రించి పెళ్లికూతురు చేయి పట్టుకొంటాడు. ఇదే పాణిగ్రహణం.


తలంబ్రాలు


దీనినే అక్షతారోహణంగా చెబుతారు. అక్షతలు అంటే నాశం లేనివి. వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు. ఇందులో ముందుగా... ఒకరి తరవాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభం అవుతుంది. సంతానం, యజ్ఞాది కర్మలు, సంపదలు, పశుసంపదలు కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు.
_

సప్తపది

-
ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢ పడుతుందట. ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది. వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, ఏడు మంత్రాలు చెబుతాడు. ఇదే సప్తపది. 

ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు. అన్నం, బలం, ప్రతిఫలం, వ్రతాదికం, పశుసంపద, సంతానం, ఋషుల అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగూ వేస్తూ చదువుతారు.
ఈ మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెప్పారు. ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.


కొత్త బంధాలు, పరిచయాలు :


మానవజీవితంలోని అన్ని సంస్కారాలలోకీ అతి ముఖ్యమైనది వివాహం. దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది. మూడుముళ్ల బంధం తో వివాహజీవితం కొనసాగుతుంది. వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకం, కాశీయాత్ర, కన్యాదానం, శుభముహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, సప్తపది, అరుంధతీ దర్శనం. ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య, బంధుమిత్రుల శుభాశీస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది. వివాహంతో ఇరువర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు, కొత్త బంధాలు, అనుబంధాలు కలుగుతాయి.
-

ఆత్మల అనుసంధానం :


మానవుడు... కడుపులో ఉన్నప్పటి నుంచి, తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది, స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.

జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది. లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం, పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి. 


తాళి బొట్టు గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

మంగలసుత్రాల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అయిదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది.

పెళ్లి ఐన స్త్రీకి అందం ఐశ్వర్యం మేడలో తాళి బొట్టు అయితే భర్త భార్యకి కట్టినప్పుడు వేదం మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది అయితే భార్య మేడలో మంగళసూత్రం మరియు నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను మరియు సంతోషాలను కాపాడుతుంది.

 అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. అయితే మంగలసుత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్దిస్తుంది.


 ప్రతి శుక్రవారం మరియు మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగలసుత్రలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలాగా చేస్తే ఐదావతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది.

 మంగలసుత్రలకు పిన్నిసులు మరియు ఏ ఇతర ఇనుముకి  సంభందించినవి పెట్టకూడదు.

 మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి.

 మంగలసుత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) మరియు నలుపు పూసలు ఉండాలి.

పొరపాటున మంగలసుత్రాలు తెగిపోతే ఏమి చెయ్యాలి?

వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి.

మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి.