banner

భగవంతునికి అప్పగించు

తప్పులు ఒప్పులు  భగవంతునికి అప్పగించు

ఓ చిన్న పిల్లవాడు తాను చేసిన మంచి పనులన్నీ తనలో ఉన్న దైవం తనచే చేయిస్తున్నాడనీ, తప్పులు మాత్రం తన స్వంత మెదడుతో తానే స్వయంగా చేస్తున్నట్లు భావించసాగాడు...

ఓ సారి ఆ కుర్రాడు బాబావారి దర్శనం కోసం పుట్టపర్తి రాగా, భక్తులకు దర్శనం ఇస్తున్న సమయంలో బాబావారు తిన్నగా ఈ అబ్బాయి వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించారు, "మహాభారతంలో పాండవాగ్రజుడయిన ధర్మజుడు ధర్మానికి కట్టుబడ్డప్పటికీ, జీవితానంతరం నరకాన్ని దర్శించవలసిన అవసరం ఎందుకు కలిగింది..?"

ఆ బాబు, "కురుక్షేత్ర యుద్ధంలో అశ్వథ్థామ అనే ఏనుగు మరణించినప్పుడు, ద్రోణాచార్యునకు వినిపించేలా "అశ్వథ్థామ హతః" అని గట్టిగా అని, "కుంజరః" అని నెమ్మదిగా అబద్ధం ఆడి, అధర్మాన్ని ఆశ్రయించాడు కనుక, ధర్మరాజుకు నరక దర్శన ప్రాప్తి కలిగింది", అని సమాధానమిచ్చాడు...

బాబావారు చిరునవ్వుతో, "అలా చెప్పమని ధర్మరాజుకు సలహా ఇచ్చినది ఎవరు..?" అని ప్రశ్నించారు. "సాక్షాత్తు భగవత్ స్వరూపులయిన శ్రీ కృష్ణులవారే అలా చెప్పమని ధర్మజుని ప్రోత్సహించారు", అని చెప్పాడు ఆ కుర్రాడు...

"ధర్మజుడు దైవాజ్ఞ పాటించినపుడు ఎందుకు కష్టాల పాలయ్యాడు..?", బాబావారి ప్రశ్నకు ఆ చిన్నవాని వద్ద సమాధానం లేదు...

అప్పుడు స్వామి ఇలా ప్రవచించారు, "అబద్ధం ఆడినట్లయితే, ఆ పాపం తనకు చుట్టుకుంటుందేమోనని ధర్మజుడు భీతిల్లాడు. అది అహం అవుతుంది. అలా కాక, దైవాజ్ఞ సంభూతమయిన ఆ పని ఫలితాన్ని తిరిగి దైవానికి సమర్పించినట్లయితే, అతనా సమస్య నుండి దైవంచే రక్షించబడేవాడు.

అలాగే, నీవు చేసే మంచిని దైవానికి సమర్పిస్తున్నావు కనుక, నీకు దైవానుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా, నీవు చేసే తప్పులు, చెడ్డ పనులను కూడా స్వామికి సమర్పిన్చి, అవి మరలా చేయకుండా ఉండే శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తే, స్వామి నిన్ను మన్నించి, నీకు సహకరిస్తాడు..."

   ఈ ప్రపంచంలో చాలా సమస్యలకు మూలం "పాపం" చేసుకోవటమే... పాపం చేయునపుడు పొందే ఆనందం దాని ఫలితాన్ని అనుభవించునపుడు ఉండదు... ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఈనాడు ఈ ఖర్మ అనుభవిస్తున్నాను అని వాపోతారు జనులు... కానీ, చేసే పనులలో ఏది పాపమో అర్థం చేసుకోలేని అధమ స్థితిలోనే ఉండిపోతున్నారు...

ఆత్మ పరిశీలన, పాపపుణ్యాల పై సమగ్ర అవగాహన అత్యన్తావశ్యకం... అవి సాధించవలెనన్న సత్సంగం, ఆధ్యాత్మిక పుస్తక పరిశోధన అవసరం...

అంతఃకరణను సరియైన పద్ధతిలో శుద్ధి చేయకున్న, ఆలోచనలు శుద్ధి కాక, మనసు, ఆచరణ, పాప మార్గాన పడి, భవిష్యత్తులో సాధించవలసిన దైవ సాన్నిహిత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది... కనుక, బాబావారు చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా గమనించి, ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి, దైవ సాన్నిహిత్యాన్ని సముపార్జించి, జీవితాలను ఆనంద నందన వనాలుగా మార్చుకొందురు గాక...