banner

కర్మలుకర్మలు మూడు రకాలు1.ఆగామి కర్మలు
2.సంచిత కర్మలు
3.ప్రారబ్ద కర్మలు

1.ఆగామి కర్మలు అనగా మనము చేసే పనుల వల్ల ప్రాప్తించే కర్మలు, కొన్ని వెంటనే ఫలితాలను ఇస్తాయి.

2.సంచిత కర్మలు అనగా పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. ఉ: తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చవలసిందే.

3. ప్రారబ్ద కర్మలు అనగా పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు..

1.పూజలు, యజ్ఞ యాగాదులు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనం ఇత్యాదులతో ఆగామి కర్మల నుండి విమోచనం పొందవచ్చు. పుష్కర స్నానాలు కూడా అందుకే. మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. వెళ్ళే దారిలో చీమలు వంటి సూక్ష్మ జీవులను చంపడం లాంటివి. ఇలా తెలియకుండా చేసిన పాపాల నుండి విమోచన కోసమే, ఈ పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు వగైరా...

2.పితృదేవతలకు తర్పణం ఆరాదన, యజ్ఞము, హోమము వాటితో కొంతవరకు సంచిత కర్మల నుండి విమోచనం పొందవచ్చు .

3. ప్రారబ్ద కర్మల ను మాత్రం అనుభవించాల్సిందే.ఆగామి కర్మలు బంధం కాకుండా ఎట్లు:

                  మనం ఇప్పుడు చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. ఎటువంటి కర్మ చేసిన ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం . అందువల్ల కర్మలు చేస్తూ కూడా ఆ కర్మఫలం మనకు అంటకుండా, బంధం కాకుండా తప్పించుకొనే ఉపాయాలను భగవానుడు మనకు భగవద్గీతలో తెలియచేసాడు.
అవి :

1. కర్త్రత్వాభిమానం లేకుండా కర్మలు చేయుట

2. నిష్కమలంగా, ఫలాసక్తి లేకుండా కర్మలు చేయుట.

కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన |
మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి || 
   (భగవద్గీత 2:47)

కర్మలను ఆచరించుట యందె నీకు అధికారము కలదు కానీ, వాటి ఫలితములపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు.అట్లని కర్మలను చేయుట మానరాదు.

౩. లోకా కళ్యాణం కొరకు, భగవత్ప్రీతి కొరకు కర్మలు చేయుట.

4. ఈస్వరార్పితంగా కర్మలు చేయుట.

 ఈ విషయన్నే రమణ మహర్షి “ఉపదేశసారం” లో ఇలా తెలియచేసారు.

“ఈస్వరార్పితం నేచ్ఛయాకృతం | చిట్టా శోధకం, ముక్తి సాధకం ||”

అంటే పైన చెప్పిన ప్రకారం కర్త్రుత్వాభిమానం లేకుండా కర్తవ్యతాభావంతో, నిష్కామంగాను, ఫలాశాక్తి లేకుండా, లోకహితార్థంగాను, ఈశ్వరార్పితంగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటారు.

అంటే కర్మను కర్మగా గాక, కర్మయోగంగా చేయుట ద్వార మనం చేసే కర్మలు సంకుచితం కాకుండా, మనకు బంధాలు కాకుండా చేసుకోవాలి.కనుక మనంచేసే కర్మలను ఒకటికి రెండుసార్లు బుద్దితో యోచించి, శాస్త్రం ఎలా చెబుతుందో తెలుసుకొని, మన మనోబుద్దులు అందుకనుగుణంగా సవరించుకొని కర్మలు చేయాలి.ఎక్కుపెట్టిన బాణం వంటిది ఆగామి కర్మ. ఇది చేయటం మన చేతుల్లో వున్నది గనుక జాగ్రత్త పడాలి. బంధాల నుండి తప్పించుకోవాలి. కనుక ఆగామి కర్మలను కర్మయోగం ద్వార చేసి బంధాలు కాకుండా చూసుకోవాలి.

ప్రారబ్ధ కర్మలు బంధం కాకుండా ఎట్లు :

జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అప్పటికి ఉన్న సంచిత కర్మలలోనుండి ఏవి పక్వానికి వస్తాయో ఆ కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు.ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవించటానికి తగిన శరీరాన్ని ధరించి జీవుడు ఈ లోకంలోనికి వచ్చిపడుతాడు. ఆ ప్రారబ్ధ కర్మలన్నిటిని తప్పక అనుభవించాల్సిందే. 

అలా అనుభవిస్తేనే ఆ కర్మలు ఖర్చు అయ్యేది. అనుభవిస్తేనే ప్రారబ్ధ కర్మల నుండి విముక్తి. ప్రారబ్ధ కర్మలు అంటే ధనస్సు నుండి విడిచిన బాణం వంటివి.
కనుక ప్రారబ్ధ కర్మ ఫలాలను భగవత్ స్మరణతో భక్తి యోగం ద్వార అనుభవించి ఖర్చుచేసుకోవాలి.

సంచిత కర్మలు బంధం కాకుండా ఎట్లు :

 ఆగామి కర్మలు చేయటంలో మనకు స్వతంత్రం వుంది. కనుక కర్మయోగం అనే ఉపాయంతో ఈశ్వరార్పణంతో చేస్తాము. ప్రారబ్ద కర్మలను భగవత్ స్మరణతో భక్తి యోగం అనే ఉపాయంతో అనుభవిస్తాము. కానీ ఇవి ఎప్పుడో ఇంతకూ ముందు జన్మలవి , ఇప్పుడు ఖర్చు చేద్దాం అంటే పక్వానికి రాలేదు.కనుక వీటిని అన్నిటి నుండి సంపూర్ణంగా తప్పించుకొని కర్మబంధనం లేకుండా వుండాలంటే , మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే, శాస్వతనందాన్ని పొందాలంటే , ఆ పరమాత్మునిలో ఐక్యం కావాలంటే ఈ సంచిత కర్మలన్నిటిని ఒక్కసారిగా దగ్దం చేయాలి ?

 ఎక్కడ ? జ్ఞానాగ్నిలో, “జ్ఞానాగ్ని దగ్ద కర్మాణాం” అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. కనుక జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు దగ్దం చేయుట ఒక్కటే మార్గం.ఈ ఉపయాన్నే జ్ఞానయోగం అన్నారు. 

జ్ఞానం అంటే ఏమిటి ?

నీ స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం.అంటే నీ యొక్క అసలు రూపమే సచ్చిదానంద స్వరూపం, అంటే నీవు ఈ మాంసక్రుతులతో కూడిన ఈ శరీరం కాదు , నువ్వు ఆత్మవు అయిన ఆ సచ్చిదానంద స్వరుపుడివి అని తెలుసుకోవడం.

ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పుడు  సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. 

ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి. తెలుసుకున్నంత మాత్రాన దగ్ధమై పోతాయ అన్న సందేహం వలదు. తప్పకుండ దగ్ధమై పోతాయి.