పూరీ జగన్నాథుడికి జలుబు జ్వరం


ఏ క్షేత్రంలో అయినా మూలవిరాట్టుకు నిత్యాభిషేకాలు నిత్యం జరుగుతాయి. సందర్భానుసారం సహస్ర ఘటాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తుంటారు. కానీ, పూరీలో కొలువైన జగన్నాథుడికి ఏడాదికి ఒకేసారి అభిషేకం నిర్వహిస్తారు. 

ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు ఇది జరుగుతుంది. దీనిని దేవస్నాన పూర్ణిమగా వ్యవహరిస్తారు. 
అంటే.. స్వామివారి ఎదుట అద్దం ఉంచి.. అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేస్తారన్నమాట. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు మాత్రం మూలమూర్తికి ప్రత్యక్ష అభిషేకం చేస్తారు. జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రలకు కూడా అభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. 

స్నానపౌర్ణమి ఉత్సవం పూర్తయ్యాక.. ముగ్గురు దేవతా మూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరానికి తరలిస్తారు. దీనికీ ఓ కారణముంది. నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని ఓ నమ్మకం. అందుకే దేవతామూర్తులను పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేకంగా చూసుకుంటారు. ఈ పదిహేను రోజులు స్వామికి సమర్పించే నైవేద్యాల్లోనూ ఆయుర్వేద మూలికలు వాడుతారు.

 ఈ పదిహేను రోజులు భక్తులకు జగన్నాథుడి దర్శనం లభించదు. గర్భాలయంలో స్వామివారి పటాన్ని ఉంచుతారు. దీనిని పట్టచిత్రా అని పిలుస్తారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజు చీకటి మందిరం నుంచి మూలవరులను గర్భాలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు.


పూరీలోని మూలవరులను వేప చెక్కలతో  రూపొందిస్తారు. నిత్యాభిషేకాలు చేస్తే కలప పాడవుతుందని ఇలా ఏడాదికోసారి అభిషేకం నిర్వహించే సంప్రదాయం వచ్చింది. స్వామివారికి నిత్యం దర్పణ స్నానం నిర్వహిస్తారు.