banner

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు


ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఆగస్టు నెలాఖరుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. 

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం నాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలిరోజైన సెప్టెంబరు 13న ధ్వజారోహణం నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌ|| ముఖ్యమంత్రివర్యులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా సెప్టెంబరు 17న గరుడవాహనం,
 సెప్టెంబరు 18న స్వర్ణరథం,
 సెప్టెంబరు 20న రథోత్సవం, 
సెప్టెంబరు 21న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగుతాయన్నారు. 

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా అక్టోబరు 14న గరుడవాహనం, 
అక్టోబరు 17న స్వర్ణరథం, 
అక్టోబరు 18న చక్రస్నానం జరుగుతాయని వివరించారు. 

ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుందని, గరుడవాహనసేవ రాత్రి 7 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలియజేశారు.

 శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, ఆగమ సలహామండలి సభ్యులు, ఆలయ ప్రధానార్చకులను సంప్రదించిన అనంతరమే రాత్రి వాహనసేవ సమయంలో మార్పు చేసినట్టు తెలిపారు.


ఆగస్టు 26న పౌర్ణమి గరుడసేవ నాడు అన్ని విభాగాలవారితో ప్రయోగాత్మక సమాయత్త బ్రహ్మోత్సవ గరుడసేవ నిర్వహిస్తామని, ఇందులో పోలీసు బందోబస్తు, లైటింగ్‌, 
ఎస్వీబీసి ప్రత్యక్ష ప్రసారాలు తదితర ఏర్పాట్లను పరిశీలిస్తామని జెఈవో తెలిపారు.

 బ్రహ్మోత్సవ వాహన తేదీలు, ఇతర సేవలు, ప్రత్యేక దర్శనాల రద్దు వివరాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌, ఇతర ప్రసారమాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. 

ఇందుకోసం పోస్టర్లు, బుక్‌లెట్లు, ఫ్లెక్స్‌ బ్యానర్లు, ఆహ్వానపత్రికల(ఇన్విటేషన్స్‌)ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయం చేసుకుని భక్తులకు భద్రత కల్పిస్తామని, శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా భక్తులకు సేవలందిస్తామని వివరించారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, లడ్డూప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టులు, వేద పాఠశాలలతో కలిపి ప్రత్యేక ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ సారి ఇతర రాష్ట్రాల కళాబృందాలు ఆకట్టుకుంటాయని తెలియజేశారు.

ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో బాలాలయం, అష్టబంధన మహాకుంభాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 12 నుండి 16వ తేదీ వరకు బాలాలయం, అష్టబంధన మహాకుంభాభిషేకం జరుగనుందని, దీనికి ఆగస్టు 11న అంకురార్పణ నిర్వహిస్తామని జెఈవో తెలిపారు. శ్రీవారి పుష్కరిణి మరమ్మతులను జులై 10న ప్రారంభించి ఆగస్టు 10వ తేదీలోపు పూర్తిచేసి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తామని చెప్పారు.

సమీక్ష సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చ‌కులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, శ్రీగోవిందరాజ దీక్షితులు, శ్రీ శ్రీకృష్ణశేషాచల దీక్షితులు, టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీఓ.బాలాజి, డిఎల్‌ఓ శ్రీ రమణనాయుడు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీరామచంద్రారెడ్డి, శ్రీరమేష్‌రెడ్డి, శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.