banner

పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం


జై జగన్నాథ నినాదాలతో పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. లక్షలాది భక్త జనఘోష మధ్య బలభద్ర, సుభద్రలతో కలసి రథాలపై గుండిచా (పెంచినతల్లి) మందిరానికి బయలుదేరాడు. 

యాత్ర తిలకించడానికి యాత్రికులు శుక్రవారమే పెద్ద సంఖ్యలో పూరీ చేరుకున్నారు. రథయాత్ర సాగే పెద్ద వీధి ఆవరణ పురుషోత్తమ నామస్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. దేశ, విదేశాల నుంచి చేరుకుంటున్న భక్తులతో మఠాలు, ఆశ్రమాలు, ధర్మశాలలు, హోటళ్లు నిండిపోయాయి. రెండు రోజులపాటు జరిగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూపం వెనక... 

ఇంద్రద్యుమ్న అనే రాజుకు విష్ణువు కలలో కనిపించి సముద్రంలో చాంకీనది ముఖద్వారం వద్ద నీటిలో తేలియాడుతున్న వేప దుంగలను తీసుకొచ్చి విగ్రహాలుగా తీర్చిదిద్దమని సూచిస్తాడు.

 రాజు ఆ ప్రాంతానికి వెళ్లి దుంగలు తీసుకువస్తాడు కానీ విగ్రహాలను తయారుచేయడానికి ఎవరూ ముందుకు రారు. దిగులుపడుతున్న రాజు వద్దకు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తాను విగ్రహాలను రూపొందిస్తానంటాడు. 

అయితే తనకు ఒక ప్రత్యేక గది ఇవ్వాలనీ, 21 రోజుల పాటు తనకు ఎలాంటి అంతరాయం కలిగించకూడదనీ హెచ్చరిస్తాడు. అందుకు రాజు అంగీకరిస్తాడు. రోజులు గడిచిపోతున్నా ఆ గది నుంచి ఎలాంటి శబ్దాలూ వినిపించవు. 

రాజు ఆతృతతో ఒక రోజు వెళ్లి గది తలుపులు తెరుస్తాడు. అక్కడ విశ్వకర్మ కనిపించడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలి ఉంటాయి. దీంతో పశ్చాత్తాపం చెందిన రాజు బ్రహ్మదేవుడికై తపస్సు చేసి, ఆ విగ్రహాలు అవే రూపాల్లో పూజలందుకుంటాయన్న వరాన్ని పొందుతాడు.

ఈ యాత్ర అందుకే .! 

ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండిచాదేవి పిల్లలు లేని కారణంగా జగన్నాథుడినే తన కొడుకుగా భావించి పూజించింది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల కోసం ప్రధాన ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక గుడి కట్టించింది. 

ఆమె భక్తికి మెచ్చిన స్వామి గుండిచాదేవిని తల్లిగా స్వీకరించి, ఏడాదిలో కొద్దిరోజులు ఆమె దగ్గర ఉంటాననే వరాన్ని ప్రసాదిస్తాడు. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం గుండిచా మందిరానికి జగన్నాథుడు రథాలమీద చేరుకోవడమే ఈ యాత్ర ఉద్దేశం.

ప్రతి రథం విలక్షణం

జగన్నాథ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) రోజున వీటి నిర్మాణానికి శ్రీకారం చుడతారు. రెండు నెలలపాటు ఈ పనులు కొనసాగుతాయి. 

ప్రతి రథం విలక్షణంగా, నిర్దిష్టమైన కొలతలతో నిర్మితమవుతుంది. జగన్నాథుని రథాన్ని ‘నంది ఘోష’ అంటారు. ఇది 45 అడుగుల ఎత్తు ఉంటుంది. బలభద్రుని రథం పేరు ‘తాళధ్వజం’. దాని ఎత్తు 44 అడుగులు. సుభద్రా దేవి అధిరోహించే రథం పేరు ‘దర్పదళన’. దీన్నే ‘దేవదళన’, ‘పద్మధ్వజ’ అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 43 అడుగులు.

 ఈ రథాలను వేర్వేరు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. జగన్నాథ రథానికి ఎరుపు, పసుపు, బలభద్ర (బలరామ) రథానికి ఎరుపు, నీలం, సుభద్రాదేవి రథానికి నలుపు, ఎరుపు రంగుల వస్త్రాలు ఉంటాయి.

యాత్ర ఇలా... 

రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్యనాడు విగ్రహాలకు నేత్రోత్సవం జరుగుతుంది. అప్పటి వరకూ చీకటిగదిలో ఉంచిన ఆ విగ్రహాలకు మరుసటి రోజు నుంచీ యథావిధిగా పూజాదికార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

 ఆషాఢ శుద్ధ విదియనాడు విగ్రహాలను కదిలించి రథాలమీద అలంకరింపజేస్తారు. పూరీ రాజు అక్కడకు చేరుకుని బంగారు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. కస్తూరి కళ్లాపి జల్లి, రథాన్ని తాళ్లతో లాగి రథయాత్రను ప్రారంభిస్తాడు. దీన్నే గుండిచాయాత్ర లేదా ఘోషయాత్ర అంటారు. 

గుండిచా ఆలయంలో ఏడు రోజులు పూజలందుకున్న జగన్నాథుడి విగ్రహాన్ని దశమినాడు (జులై 22) తిరుగు ప్రయాణం చేయిస్తారు. దీన్నే బహుదా యాత్ర అంటారు. 

మరుసటిరోజు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరించి రత్నసింహాసనంమీద పునఃప్రతిష్ఠిస్తారు. దీంతో రథయాత్ర పరిసమాప్తమవుతుంది.

స్వామి సన్నిధికి ఇలా... 

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ పూరీకి రవాణా మార్గాలు ఉన్నాయి. భువనేశ్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పూరీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖుర్ధా రైల్వే స్టేషన్‌ నుంచి పూరీకి 44 కిలోమీటర్ల దూరం. ఈ మార్గంలోనే బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి.