banner

ఆగస్టు 16 నుండి శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు


తిరుమల తిరుపతి దేవస్థానాలకు అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

ఆగస్టు 16వ తేదీ ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5.45 నుండి 6.30 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.
 ఆగస్టు 17వ తేదీ రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు సింహవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

ఇందులో భాగంగా ఆగస్టు 18న సాయంత్రం భూత వాహనం, ఆగస్టు 19న సాయంత్రం శేష వాహనం, ఆగస్టు 20న రాత్రి 7.00 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు.

 అదేవిధంగా ఆగస్టు 21న సాయంత్రం గజవాహనం, ఆగస్టు 22న మధ్యాహ్నం 3.00 గంటలకు రథోత్సవం అనంతరం రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గృహస్త భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, లడ్డూ వడ ప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.
ఆగస్టు 23న సాయంత్రం అశ్వవాహనం, ఆగస్టు 24న ఉదయం 10.00 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3.00 గంటలకు పల్లకీ ఉత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సాయంత్రం హరికథలు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.