banner

దొంగమల్లన్న ఆలయం


జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలంలోని తిరుమలాపూర్‌ గ్రామం లో దొంగమల్లన్న ఆలయం  విశిష్ట చరిత్ర కలదు.   

తిరుమలాపూర్‌ గ్రామం జగిత్యాలకు తూర్పున 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామంలోని ఇక్కడి మల్లికార్జున దేవాలయమే స్థానికంగా దొంగమల్లన్న గుడి అంటారు. 

ఈ దేవాలయంలో లింగరూపమున ఉన్న పరమశివున్ని గొల్లవారు, కురుమవారు మల్లన్నగా కొలుస్తారు. మల్లన్న గుడి ఉన్న ఈ ఊరును మల్లన్నపేట అంటారు. 

చాళుక్యుల కాలంలో గ్రామస్థులకెవరికి తెలియకుండా రాత్రికి రాత్రే దొంగతనంగా ఆలయాన్ని నిర్మించడం వల్ల దీనికి దొంగమల్లన్న పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

చాళుక్యల శిల్పకళా రీతులలోనున్న ఈ దేవాలయం పొలవాస రాజులచే 11, 12 శతాద్దాల కాలంలో నిర్మించారు. ఇదొక అద్భుతమైన, అరుదైన రెండంతస్తుల దేవాలయం.

 నాడు రాజధానిగా విరాజిల్లిన పొలవాస పట్టణమునకు తూర్పున ఈ గ్రామం కేవలం 5కిలోమీటర్ల దూరంలో ఉంది. పొలవాస రాజుల తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల ఆధీనమై 15, 16 శతాబ్దంలో స్థానిక వెలమ దొరల వశం అయింది. 18వ శతాబ్దంలో వెలమలు ఈ దేవాలయాన్ని హస్తగతం చేశారు. ఆనాటి నుండి నేటి వరకు కమ్మరి వారే ఈ దేవాలయ పూజారులుగా కొనసాగుతున్నారు. తొలికాలపు శాసనాలు ఏవీ లభ్యం కాకున్నా కీ.శ. 1753లో వెలమదొర వేయించిన శాసనం ఒకటి దేవాలయం ముందు ఉంది.

దొంగమల్లన్న ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిర పంచమి  ఏడు వారాలపాటు భారీఎత్తున జాతర కొనసాగుతుంది. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గొల్ల కుర్మలకు ఆరాధ్య దైవమైన దొంగ మల్లన్నకు ప్రతీ సంవత్సరం బోనాలు తీసి తులాభారం పంచిపెట్టి పట్నాలు వేస్తారు. ఒగ్గుడోలు కళాకారులు , శివసత్తుల పూనకాలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు.