Banner AD

Just Watch

>

అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు



అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు కనులారవిందగా జరుగుతున్నాయి. రోజుకో వాహనంపై స్వామి కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు.  

అహోబిలం మఠం 46వ పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ ఆధ్వర్యంలో లక్ష్మీనృసింహ స్వామి విశేష పూజలు అందుకుంటున్నారు. ఉత్సవాల్లో మూడో రోజైన మంగళవారం ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహ స్వామి హంస వాహనంపై విహరించారు.

 తెల్లవారుజామునే నిత్య పూజలు చేసిన అనంతరం జ్వాలా నృసింహ స్వామికి ప్రత్యేకంగా అలంకరించి హంస వాహనంపై కొలువుంచి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన జ్వాలా మూర్తి సూర్యవిరాజితుడై తేజోమయంగా దర్శనమివ్వడంతో భక్తులు తన్మయంలో మునిగారు.




దిగువలో.. ధ్వజారోహణం

దిగువ అహోబిలంలో ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవమూర్తులైన ప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేంకటాద్రి శిఖర కిరీటంతో అలంకరించి ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. 

అక్కడ ధ్వజస్తంభానికి ఆరాధన, కుంభప్రోక్షణ జరిపి ఉత్సవాలు సజావుగా జరగాలని కోరుతూ గరుత్మంతుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. మధ్యాహ్నం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. 



వేదమంత్రోచ్ఛరణలతో భక్తుల సమక్షంలో మహామంగళహారతినిచ్చారు. సాయంత్రం భేరీ పూజలో భాగంగా బ్రహ్మోత్సవాలకు సకలదేవతలను ఆహ్వానం పలుకుతూ భేరీ త్రాటను మోగించారు.

 రాత్రి ప్రహ్లాదవరద స్వామి విశేష అలంకరణలో సింహ వాహనంపై కొలువుదీరి ఆలయ తిరు వీధుల్లో ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. 

ఆలయ ఈవో కామేశ్వరమ్మ, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్‌ పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.