హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయం.. భక్తులకు దర్శనం ప్రారంభం


ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవేంకటేశ్వరస్వామివారి నూతన ఆలయం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో  నిర్మించారు.  

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం 6 నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఆ తరువాత భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ రూ.28 కోట్లతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 

మార్చి 8వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఋత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. ఆలయంలో ఇంజినీరింగ్‌ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారని, ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టారని, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు అందించిందని వివరించారు. ఐదు రోజుల పాటు కష్టపడి సేవలందించిన అర్చకులు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 
ఐదు ఎకరాల స్థలం ఉచితంగా ఇస్తే శ్రీవారి ఆలయం నిర్మిస్తామని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు ఈవో తెలిపారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుండి అంగీకారం వచ్చిందని, టిటిడి అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లి స్థలపరిశీలన చేపడుతున్నారని వివరించారు.టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు ప్రాకారం, తిరునామం, శంఖుచక్రాలు, అర్చకుల నివాసాలు నిర్మించామని, పార్కింగ్‌ స్థలం ఏర్పాటుచేశామని, చుట్టూ రకరకాల మొక్కలతో పచ్చదనం పెంచుతున్నామని వివరించారు. ఈ ఆలయంలో ఆర్జితసేవలను ప్రవేశపెట్టి భక్తుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు.

** Click for Download "Daivadarshan" App for devotional 


బుధవారం తెల్లవారుజామున 2.30 నుండి 5.30 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేపు చేశారు. ఉదయం 6 నుండి 7.30 గంటల మధ్య మీన లగ్నంలో ఆగమోక్తంగా మహాకుంభాభిషేకం చేపట్టారు. ఆ తరువాత ఉదయం 7.30 నుండి 9 గంటలకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఆ తరువాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

కాగా, సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.
 ఇక్కడ  శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ,  తిరుమల వద్ద ఉన్న విగ్రహాన్ని పోలి ఉంటుంది మరియు నలుపు గ్రానైట్ రాయితో 8.6 అడుగుల పొడవుతో నిర్మించబడింది.  

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ రమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ బి.అశోక్‌రెడ్డి, సభ్యులు శ్రీ పి.రామకృష్ణ, శ్రీపి.బాలరాజు గౌడ్‌, శ్రీ డి.కృష్ణమోహన్‌, శ్రీ వై.త్రినాథ్‌బాబు, శ్రీ రామిరెడ్డి, ఎస్‌ఇ శ్రీ ఎ.రాములు, డెప్యూటీ ఈవో శ్రీ పి.విశ్వనాథం, ఏఈవో శ్రీ జగన్‌మోహన్‌రాజు, తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీపాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.