banner

హోలీ పండగ ఏలా వచ్చింది ?


మన భారతీయ హిందూ సాంప్రదాయ,ఆచార వ్యవహారాలలో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిధి, నక్షత్ర రోజులలో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది పునారావృతం అవుతుంది. 

ప్రస్తుత హోలీ పండగ అనేది ఎప్పుడు, ఏలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు,నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంధాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గుణ మాస, పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేసారు. 

రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణు నామస్మరణతో వున్న ప్రహ్లాదునిపై కోపం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు. హోలికకు లభించిన వరం ప్రకారం, అగ్ని ఆమెకి ఏమీ చేయ‌దు. అన్న ఇచ్చిన ఆదేశంతో హోలిక ప్రహ్లాదుడిని ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళ్తుంది.

ఎప్పుడూ విష్ణు నామస్మరణలో ఉండే ప్రహ్లాదుడిని మంటలు తాకకుండా ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తారు. వెంటనే ప్రహ్లాదుడు ఆ మంటల నుంచి బయటకు వచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. హోలికకు వరముంది కదా.. అగ్నికి ఆహుతైందేమిటీ అని మీకు అనుమానం రావచ్చు. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వరం సిద్ధిస్తుంది. బాలకుడైన ప్రహ్లాదుడిని కూడా తీసుకొని మంటల్లో ప్రవేశించడంతో ఆ వరం ఫలించలేదు.హోలిక చనిపోయిన రోజును పురస్కరించుకొని హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు.

అందుకే కాముని పున్నమి అనే పేరు వచ్చింది.ఈ పండగను యావత్ భారత దేశ ప్రజలు అన్ని ప్రాంతలవారు ఆనందంగా జరుపుకుంటారు. 

పురాణ గ్రంధాల ఆధారంగా చూడగా..  పార్వతి, శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి బూడిద చేశాడు.  తరువాత శివుడు మన్మధుని భార్య అయిన రతీదేవి దుఃఖించగా శివుడు కనికరించి మన్మధునికి శరీరం లేకున్నప్పటికీ సజీవుడుగా ఉండే వరాన్ని అనుగ్రహిస్తాడు. మన్మధుడు అంటే కాముడు. 

ఈ కామదహనం అనేది ఫాల్గుణ పౌర్ణిమి రోజున జరిగినది. కావునఈ రోజు పండగగా చేసుకోవడం ఆచారం అయినది. సహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపోందించుకోవాలనేదే ఈ పండగలోని అంతరార్ధం. 

కాముడుని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా మానవజాతికి ఒక సందేశం కనబడుతుంది. కాముడు ప్రతీ మనిషిలోను అదృష్య రూపంలో అంతట వ్యాపించి ఉంటాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న అరిష్డ్వర్గాలైన రాగ,ద్వేష,కామ,క్రోధ,మోహ,మాయ మొదలగు గుణాలను ప్రజ్వరిల్లకుండా అను నిత్యం అదుపు చేసుకుని మనస్సుని అధీనంలో పెట్టుకోవాలని సందేశం కనపడుతుంది.  మనిషిలో కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టి పోతాడు. మనిషిలోని రజో,తామస గుణాలను పారదోలి, సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుంది. "మనిషిని మహానీయుడిగా మార్చే మహత్తరశక్తి మనస్సుకు ఉంటుంది. ఆ మనస్సుని అధీనంలో పెట్టుకోవడం కేవలం మనిషికే ఉంటుంది". మనిషి యొక్క మనస్సును, శరీరాన్ని ఆధీనంలో పెట్టుకో గలిగిన వారు మనుషులలో మహానీయులౌతారు.

 హోళి పండగను వసంతోత్సవమని, డోలికోత్సవమని, ఫాల్గుణోత్సవమని పిలుస్తారు. శీతకాలపు చలి తగ్గిపోయి ఇంచుమించు వేసవి కాలపు ఎండవేడి ప్రారంభం అయ్యేపర్వం.  

ఈ పండగ వసంతఋతువు ప్రవేశాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున పిల్లలు, పాడిపశువుల పంటల సంరక్షణకై దైవాన్ని స్మరించుకుంటారు. 

ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగుల ఉత్పత్తి అయ్యి వృద్ధిపొంది, వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం.

 పురాణ కథలతో పాటుగా హోళీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.