banner

ఉగాది పండుగను ఎందుకు, ఎలా జరుపుకుంటారు ? తెలుగు సంవ‌త్స‌రం ఆరంభ‌మ‌య్యేది ఈ రోజే.. అందుకే సంవ‌త్స‌రంలో మొద‌టి రోజు.   యుగానికి ఆది యుగాది.. కాలక్రమేణ ఉగాదిగా మారింది. సంస్కృతంలో యుగాది అనే మాటకు కృత, త్రేత, ద్వాపర,కలియుగాల్లో ఏదో ఒకదానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. 

తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతున్నాం. చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకొంటాం. హేమాద్రి, కమలాకరభట్టు వంటి పండితులు దీన్ని నిర్ధారించారు.

పురాణ కథ 

తెలుగు వారికి ఉగాది ముఖ్య‌మైన పండుగ‌. ఉగాది రోజు బ్ర‌హ్మ సృష్టిని చేశాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒక‌ప్పుడు సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి ద‌గ్గ‌రుండే పురాణాలను దొంగిలిస్తాడు. ఆ వేదాలను తీసుకుని రాక్ష‌సుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. దీంతో ఆయ‌న‌ మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలు (పురాణాలు)ను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. 
దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయడం ప్రారంభిస్తాడు. అలా బ్ర‌హ్మ సృష్టిని చేయ‌డం ఉగాది రోజే ప్రారంభిస్తాడు. దీంతో ఆ రోజుకి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్య‌త‌ను క‌ల్పించారు. ఇక మ‌న‌కు ఒక సంవ‌త్స‌రం పూర్త‌యితే బ్ర‌హ్మ‌కు అది ఒక రోజు అవుతుంది. క‌నుక బ్ర‌హ్మ‌కు రోజూ ఉగాదే అవుతుంది. అంటే అత‌ను రోజూ సృష్టి చేస్తాడ‌న్న‌మాట‌.

 ఉగాది పచ్చడి విశిష్టత 

*  ఈ రోజు అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడి.  ఈ రోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకత, విశేషత కలిగినది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్వ బోధ చేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరు స్వీకరించాలి. 

వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు సాధారణంగా వాడుతారు. మరికొన్ని ప్రాంతాల్లో జీలకర్ర, చెరుకు ముక్కలు, కొంచెం కారం, నేయి వంటివి కూడా వాడుతారు. మొత్తం మీద షడ్రుచుల సమ్మితంగా దీన్ని తయారుచేస్తారు. దీన్ని కొత్త కుండలో/గిన్నెలో తయారుచేసి పంచాంగ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలను, ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు.

 ఉగాది ప‌చ్చ‌డి మ‌హా ఔష‌ధ‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఉగాది నుంచి త‌రువాత వ‌చ్చే శ్రీ‌రామ న‌వ‌మి వ‌ర‌కు లేదా చైత్ర పౌర్ణ‌మి వ‌ర‌కు ప్ర‌తి రోజూ తినాల‌ట‌. మొత్తం 15 రోజుల పాటు ఉగాది ప‌చ్చ‌డిని తినాలని దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఆయా వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని చెబుతారు. 

ఉగాది ప‌చ్చ‌డి ఆరు రుచుల స‌మ్మేళ‌న‌మ‌ని  మ‌న‌కు తెలుసు. అందులో వేసే వేప పువ్వు, ఆకు క‌డుపులో ఉండే నులి పురుగులు, క్రిముల‌ను చంపేస్తాయి. గాలి సోక‌డం, ఆట‌ల‌మ్మ‌, అమ్మోరు వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే పచ్చి మామిడి కాయ‌ యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. దీంతో జ్వ‌రాలు రావు. వాత‌, పిత్త, క‌ఫాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. దీని వ‌ల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.


ఇక ఉగాది పండుగ‌కు చెందిన మ‌రిన్ని విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.* పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉందని పురాణోక్తి. 

* ఉగాది పండుగ వ‌సంత రుతువులో వ‌స్తుంది. సాధార‌ణంగా ఈ కాలంలో ఆట‌ల‌మ్మ‌, ఇత‌ర విష జ్వ‌రాలు ఎక్కువ‌గా వ‌స్తాయి. దీంతో పాటు ప‌లు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం  కూడా ఉంది. అందుకు ఉగాది ప‌చ్చ‌డి చాలా మేలు చేస్తుంది.* ఉగాది రోజున ఇంటి ద్వారాల‌కు మామిడి ఆకుల‌తో, బంతి పూల‌తో తోర‌ణాలు క‌డుతాం. ఈ క్ర‌మంలో బంతిపూలు, మామిడి ఆకుల‌లో ఉండే యాంటీ సెప్టిక్‌, యాంటీ బ‌యోటిక్ గుణాలు వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బ‌య‌టి నుంచి రోగ కార‌క క్రిముల‌ను ఇంటి లోప‌లికి రాకుండా చూస్తాయి.

* సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు.

ఈ రోజు చేయాల్సిన ప్రత్యేక స్నానం 

 నీటిలో గంగాదేవి, తైలం(నూనె)లో ల‌క్ష్మీదేవి ఉంటార‌ని పురాణాలు చెబుతున్నాయి.  ఉగాది రోజున ఉద‌యాన్నే నువ్వుల తైలాన్ని శ‌రీరానికి ప‌ట్టించి నాలుగు పిండితో  అభ్యంగ‌న స్నానం చేయాలి. ఇలా చేసిన‌ వారికి అష్టైశ్వ‌ర్యాలు క‌లుగుతాయని, వారికి ఆయురారోగ్యాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. క‌నుక ఈ  రోజున ఇలా స్నానం చేయ‌డం మాత్రం మ‌రువ‌కండి.