
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపుతోటలో ఆగుమెంటెడ్ రియాలిటి టెక్నాలజిని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారపుతోటలో పద్మావతి పరిణయం పేరిట ఏర్పాటుచేసిన ఫ్రేములను శనివారం తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతంతో కలిసి ఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ గూగుల్ ప్లేస్టోర్ నుండి పద్మావతి పరిణయం పేరిట గల యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ ఫ్రేములను తిలకించవచ్చన్నారు. ఫ్రేములను స్కాన్ చేసినట్లయితే పెయింటింగ్‌లోని బొమ్మలు మాట్లాడేలా ఏర్పాటు చేశామన్నారు.మొత్తం 30 ఫ్రేములున్నాయని, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ ఘట్టం వృత్తాంతాన్ని తెలియజేశారని వివరించారు. సందర్భానుసారం ఆకాశరాజు, శ్రీనివాసుడు, శ్రీ పద్మావతి, శ్రీ శుక మహర్షి, కుబేరుని చిత్రాలు ఆయా పాత్రల ఔచిత్యాన్ని తెలియజేస్తాయని వెల్లడించారు. ఇందులో శ్రీ పద్మావతి అమ్మవారి జననం, నామకరణం, బాల్యం, పరిణయం తదితర ఘట్టాలు ఉన్నాయని తెలిపారు. 15 నిమిషాల వ్యవధిలో అమ్మవారి పరిణయ ఘట్టాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు.
భక్తుల కోసం సెల్లార్…
ఆలయం వద్దగల పాత అన్నదాన భవనంలో ఏర్పాటుచేసిన సెల్లార్‌ను ఈవో, జెఈవో కలిసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా 600 మంది కూర్చునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేపట్టామన్నారు.సెల్లార్లో కుంకుమార్చన టికెట్ కౌంటర్‌తోపాటు, రూ.100/-, రూ.20/- దర్శన టికెట్ల కౌంటర్లు, ఆర్వో తాగునీటి వసతి ఏర్పాటుచేశామని, శ్రీ పద్మావతి అమ్మవారి అష్టోత్తరనామావళిని సంస్కృతం, తెలుగులో అర్థాలతో ప్రదర్శించామన్నారు. టిటిడికి చెందిన 40 ఆలయాల ఫొటోలు, ప్రాశస్త్యాన్ని, దర్శన వేళలు, ఆర్జితసేవల వివరాలను టివిల్లో ప్రదర్శిస్తున్నామని, ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు కూడా అందిస్తున్నామని వివరించారు. రానున్న కాలంలో పద్మపుష్కరిణిలో లేజర్ షో ఏర్పాటుచేస్తామని, వాటర్ వాల్లో అమ్మవారి జననం.. స్వామివారి గమనం అంశాలను ప్రదర్శిస్తామని తెలియజేశారు.
యాప్‌ను ఉపయోగించే విధానం
– స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా పద్మావతి పరిణయం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
– క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
– చిత్రపటం ముందు 6 అడుగుల దూరంలో నిలబడి యాప్ ద్వారా ఫ్రేమ్‌లను స్కాన్ చేసి సన్నివేశాన్ని వీక్షించవచ్చు.
– యాప్‌ను ఉపయోగించేటపుడు హెడ్ ఫోన్లను తప్పనిసరిగా ఉపయోగించాలి. అప్ డౌన్లోడ్ చేయడానికి ప్లే స్టోర్ లో Padmavathi Parinayam అని టైపు చేయండి.
ఈవో, జెఈవో తనిఖీలు
వేసవి నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చలువపందిళ్లు, చలువసున్నం ఏర్పాటు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. లడ్డూ కౌంటర్ల భవనంలో మొదటి అంతస్తులో గల హెడ్ కౌంట్ సిసిటివి మానిటరింగ్ సెంటర్‌ను పరిశీలించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను గుర్తించేందుకు వీలుగా చక్కగా ఏర్పాట్లు చేశారని విజిలెన్స్ అధికారులను అభినందించారు. లడ్డూ కౌంటర్లలో టికెట్లు స్కాన్ చేసి లడ్డూలు పంపిణీ చేసే ప్రక్రియను పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. టిటిడి ప్రచురణల విక్రయాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఇలు శ్రీ రాములు, శ్రీ వేంకటేశ్వర్లు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఇఇలు శ్రీ సత్యనారాయణ, డిఇలు శ్రీ రవిశంకర్‌రెడ్డి, శ్రీ చంద్రశేఖర్, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.