తిరుమల భక్తుల తలనీలాల విక్రయం


కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలం గురువారం నిర్వ‌హించారు. త‌ద్వారా టిటిడి రూ. 3.85 కోట్ల ఆదాయాన్ని గడించింది.

ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులోభాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. 

మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 3,700 కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి.




తలనీలాలలో మొదటి రకం(27 ఇంచుల పైన), రెండో రకం(19 నుండి 26 ఇంచులు), మూడో రకం(10 నుండి 18 ఇంచులు), నాలుగో రకం(5 నుండి 9 ఇంచులు), ఐదో రకం(5 ఇంచుల కన్నా తక్కువ) టిటిడి ఈ-వేలంలో పెట్టింది.

మొదటి ర‌కం తలనీలాలో కిలో రూ.26,005/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 4,200 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు. కిలో రూ. 18,333/-గా ఉన్న బి క్యాట‌గిరి – 300 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు.

రెండో రకం తలనీలాలో కిలో రూ.17,812/-గా ఉన్న ఏ క్యాట‌గిరి – 3,800 కిలోలను వేలానికి ఉంచగా 1,300 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.231.56 లక్షల ఆదాయం సమకూరింది. అదేవిధంగా కిలో రూ. 8,607/-గ‌ఆ ఉన్న బి క్యాట‌గిరి – 4,500 కిలోలు వేలానికి ఉంచగా 800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.68.86 ల‌క్ష‌ల‌ ఆదాయం లభించింది.

మూడో రకం తలనీలాలో కిలో రూ.6,032/-గా ఉన్న ఏ క్యాట‌గిరి 800 కిలోలను వేలానికి ఉంచారు. అన్నీ అమ్ముడుపోయాయి. తద్వారా రూ.48.32 లక్షల ఆదాయం లభించింది. కిలో రూ.4,554/-గా ఉన్న బి క్యాట‌గిరి – 20,900 కిలోలు వేలానికి ఉంచగా 800 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.36.43 ల‌క్ష‌ల‌ ఆదాయం సమకూరింది.

కిలో రూ.1,801/-గా ఉన్న నాలుగో రకం తలనీలాలను 5,500 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.

కిలో రూ.37/-గా ఉన్న ఐదో రకం తలనీలాలను 51,000 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు.